
సాక్షి, హైదరాబాద్: ప్రయాణానికి పాత పాస్‌పోర్టు ఉపయోగించినంత మాత్రాన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తమ దేశ పౌరుడు కాలేరని లిఖితపూర్వకంగా జర్మనీ రాయబార కార్యాలయం చెప్పిందని ఆయన తరఫు న్యాయవాది వై.రామారావు కోర్టుకు నివేదించారు. చెన్నమనేని నిబంధనలకు అనుగుణంగా 2009లో భారత పౌరసత్వం పొందారని, రాజకీయ ప్రత్యర్థి వరుసగా ఎన్నికల్లో ఓటమి కావడంతోనే ఈ కేసు వేశారని చెప్పారు.
చెన్నమనేని రమేశ్ 2009లో భారత పౌరసత్వం పొందారు. ఆ తరువాత వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ వేములవాడలో ఆయనపై పోటీ చేసిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో దాదాపు ఏడాదిన్నర క్రితం కేంద్ర హోంశాఖ చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నమనేని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. చెన్నమనేని తరఫున వై.రామారావు వాదనలు వినిపిస్తూ.. భారత పౌరసత్వం ఇచ్చిన 30 రోజుల్లో అతని పౌరసత్వంపై అభ్యంతరాలు తెలిపాలని నిబంధన ఉందన్నారు.
కానీ, ఎన్నికల్లో ఓటమి తర్వాత(120 రోజుల) ప్రత్యర్థి అభ్యంతరం తెలుపడం.. హోంశాఖ దాన్ని స్వీకరించడం చట్టవిరుద్ధమన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా హోంశాఖ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. భారత పౌరసత్వం తీసుకున్న నాటికి రమేశ్ రాజకీయాల్లో లేరని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి(ఆగస్టు 24) వాయిదా వేసింది.