( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. శుక్రవారం సాయంత్రం సచివాలంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. వేములవాడ నియోజకవర్గంలోని అభివృద్ది పనులు, పెండింగ్ పనులు, అనుమతులపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా చెన్నమనేనికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా వేములవాడ ఎమ్మెల్యే టికెట్‌ను చల్మెడ లక్ష్మీనర్సింహరావుకు కేటాయించడంతో చెన్నమనేని అలకబూనిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమనేని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమించారు. అంతేగాక ఇటీవలే చెన్నమనేని రమేష్ అమెరికా, దుబాయ్ దేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాల ఏర్పాటు చేసుకుని తెలంగాణ వచ్చారు.
ఈ క్రమంలో నేడు కేటీఆర్‌తో భేటీ అయి.. వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ పనుల అనుమతులు, దేవాలయ అభివృద్ది, కలికోట సూరమ్మ చెరువు, మిగిలి వున్న ముంపు గ్రామాల సమస్యలు, ప్రధాన మైన రోడ్లు, బ్రిడ్జీల అనుమతులు మొదలగు వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహా దారులుగా నియమితులైన రమేష్‌కు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి గురుతరమైన బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇందుకు సహకరించిన జిల్లా స్థానిక మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెన్నమనేని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పజెప్పిన ఈ బాధ్యతకు పూర్తిస్థాయి న్యాయం చేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment