సాక్షి, హైదరాబాద్/బోయినపల్లి(చొప్పదండి): జమ్మూ కశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన ఆర్మీ జవాన్ పి.అనిల్ భౌతికకాయం శనివారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. అనిల్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అనిల్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్.
ఇక, హైదరాబాద్‌కు చెందిన ఆర్మీ అధికారులు శుక్రవారం మల్కాపూర్‌ను సందర్శించారు. జమ్మూకశ్వీర్, హైదరాబాద్ నుంచి సైనికాధికారులు రానున్నారని, అంత్యక్రియల స్థలం విశాలంగా ఉండేలా చూడాలని కుటుంబ సభ్యులను కోరారు.
అంతకుముందు.. శుక్రవారం సాయంత్రం హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు అనిల్ పార్థీవదేహం చేరుకుంది. ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన అనిల్ పార్థివదేహానికి తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా హెడ్–క్వార్టర్స్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ రాకేశ్ మనోచ నివాళులు అర్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన అనిల్ జమ్మూకశ్మీర్‌లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. హెలికాప్టర్ కూలి ఓ నదిలో పడిన ప్రమాదంలో అనిల్ మృతిచెందాడు. అయితే, ఇటీవలే 45 రోజుల పాటు లీవ్‌లో ఉండి పదిరోజుల క్రితమే మళ్లీ త్వరలోనే వస్తానని చెప్పి అనిల్ వెళ్లిపోయాడు. ఇంతలోనే ప్రమాదంలో ఇలా మృతిచెందడంతో మాల్కాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
అనిల్ మృతి పట్ల రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువ జవాన్‌ను కోల్పోవడం బాధాకరమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి
Comments
Please login to add a commentAdd a comment