![Ashok Gasti, Sambasiva Rao Condolence Meet in Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/10/Ashok_gasti_USAA.jpg.webp?itok=sIrXlu0S)
అశోక్ గస్తీ, ఉసా (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉప్పుమావులూరి సాంబశివరావు(ఉసా), రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ సంస్మరణ ఆదివారం జరగనుంది. కర్మాన్‌ఘాట్ దుర్గానగర్‌లోని జేవీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ వీ చంద్రవదన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్. వినయ్‌కుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. దుగ్యాల అశోక్, సీఎల్‌ఎన్ గాంధీ, ఎస్. రామానందస్వామి, ఎం గంగాధర్, కె. వెంకటేశ్వరరావు, ఆర్. వెంకటేశ్వర్లు, డాక్టర్ సారంగపాణి ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరగనుంది.
దళిత బహుజనుల ఆత్మగౌరవం కోసం జీవిత కాలం పోరాడిన ఉసా కరోనా బారిన పడి కన్నుమూశారు. జూలై 25న హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో జన్మించిన ఉసా దళిత, బహుజన, ఉద్యమ మేధావిగా ఎదిగారు. పీడిత ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసి ఉద్యమాల ఉపాధ్యాయుడిగా మన్ననలు అందుకున్నారు.
కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అశోక్ గస్తీ(55) సెప్టెంబర్ 17న కరోనాతో చనిపోయారు. కర్ణాటకలో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో అంచెలంచెలు ఎదిగి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ అగ్ర నాయకులు షాక్‌కు గురయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండానే అశోక్ గస్తీ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment