
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో శుక్రవారం(నేడు) నిర్వహిస్తున్న వినాయక నిమజ్జన ఉత్సవాలకు అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వశర్మ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి(బీజీయూఎస్) ఆహ్వానం మేరకు గురువారంరాత్రి ఆయన నగరానికి చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకోవాల్సి ఉండగా, వేరే కార్యక్రమంలో గవర్నర్ ఉన్న కారణంగా ఈ భేటీ జరగలేదు.
ఆయన ట్రిడెంట్ హోటల్‌లో బసచేస్తున్నారు. శుక్రవారం ఉదయం విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ), బీజీయూఎస్ నేతలు, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసి వచ్చిన తెలుగు ఉన్నతాధికారులతో కలిసి ఆయన అల్పాహా రం స్వీకరిస్తారు. ఉదయం 11 గంటలకు రాడిసన్ హోటల్‌లో మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తారు. మొజంజాహి మార్కెట్ వద్ద ప్రధాన వినాయక విగ్రహాల ఊరేగింపును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తారు.