భద్రాద్రి జిల్లా కలెక్టర్ సాగు పాఠాలు
యూట్యూబ్‌లో జితేశ్ వి.పాటిల్ వీడియోలు
మునగ సాగుతో తొలి ప్రయోగాలు
సంప్రదాయేతర పంటలపై అవగాహన
సంప్రదాయేతర పంటల సాగు ద్వారా ఏజెన్సీ రైతులు అధిక ఆదాయం సాధించేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వీలుగా యూట్యూబ్ చానల్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఈ చానల్ ద్వారా ప్రత్యేక వీడియోలు అప్‌లోడ్ చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
మునగ అంటే మొదటి మెట్టు
‘కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం’పేరుతో ఉన్న యూట్యూబ్ చానల్‌లో జితేశ్ వి.పాటిల్ 40 నిమిషాల నిడివి గల వీడియోను ఈనెల 23న అప్‌లోడ్ చేశారు. జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారని, ఈ సంప్రదాయ పంటల సాగు వల్ల ఎకరానికి రూ.20 వేలకు మించి ఆదాయం రావడం లేదని ఆ వీడియోలో కలెక్టర్ స్పష్టం చేశారు. మునగ సాగు చేయడం ద్వారా కనిష్టంగా రూ.75 వేలు, గింజలు, ఆకుల అమ్మకం ద్వారా మరో రూ.25 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరంగా చెప్పారు.
ఖర్చు లేకుండా సాగు
ఎకరంలో వెయ్యి మునగ చెట్లు నాటొచ్చని కలెక్టర్ పాటిల్ తెలిపారు. మొక్క నాటింది మొదలు దిగుబడి వచ్చే వరకు రైతులకు ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది, రైతులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటనేవి వివరించారు. విత్తనాలు, మెటీరియల్ కాంపోనెంట్ అంతా కలిపి ఎకరానికి రూ.33 వేల దాకా ఖర్చు వస్తుందని, ఇదే సమయంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు ఉపాధి హామీ పథకం తోడైతే రూ.34,500 వరకు రైతుకు సాయం అందుతుందన్నారు. మునగ సాగుకు ఉపాధి హామీ పథకం వర్తించాలంటే ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులై ఉండాలని చెప్పారు.
మార్కెటింగ్ ఈజీ
ఒక మునగ చెట్టుకు కనిష్టంగా 180.. గరిష్టంగా 500కు పైగా కాయలు వస్తాయని తెలిపారు. ఒక చెట్టుకు 180 కాయల దిగుబడి అనుకుంటే... రూపాయికి రెండు కాయల వంతున అమ్మినా ఎకరం మీద రూ.75 వేల ఆదాయం కచ్చితంగా వస్తుందన్నారు. తక్కువ రేటుకు అమ్మితే హైదరాబాద్ నుంచి వ్యాపారులే వచ్చి మునగ కాయలు తీసుకెళతారని, మార్కెటింగ్ చేయాల్సిన అవసరమే ఉండదని చెప్పారు.
నవంబర్‌లో మొదలు
నవంబర్ రెండో వారంలో విత్తనాల కొనుగోలుతో మొదలయ్యే ‘మిషన్ మునగ’జూన్ చివరి వారంలో దిగుబడి తీసుకునే వరకు కొనసాగనుంది. ప్రతీ నెల, ప్రతీ వారం ఏ పని చేయాలనే అంశంపై రూపొందించిన రూట్‌మ్యాప్‌ను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి పంపారు. రాబోయే రబీ సీజన్‌లో జిల్లాలో కనీసం పది వేల ఎకరాల్లో మునగ సాగు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కలెక్టర్ ఆలోచనలు ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత జిల్లా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇప్పుడు ఉంది.
అవగాహన తెచ్చుకొని
భద్రాద్రి జిల్లా కలెక్టర్‌గా ఈ ఏడాది జూన్ 15న జితేశ్ వి.పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అశ్వారావుపేట మండలంలో పెద్దవాగుకు గండిపడింది. బాధిత రైతులతో మాట్లాడుతున్న సందర్భంలోనే జిల్లా రైతులు తక్కువ ఆదాయం పొందుతున్న అంశాన్ని కలెక్టర్ గుర్తించారు. అప్పటి నుంచి జిల్లాలో సాగు జరుగుతున్న తీరుతెన్నులు ఆయన పరిశీలించారు.
ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా రైతులకు అధిక ఆదాయం రావాలంటే మునగ సాగే మేలనే నిర్ణయానికి వచ్చారు. అంతటితో ఆగిపోకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి పక్కా రోడ్‌మ్యాప్ రూపొందించారు. మలిదశలో మునగ సాగుతో పాటు రెండు ఎకరాల పొలంలో మునగ, వెదురు సాగుతో పాటు చేపలు, తేరో టీగల పెంపకంపై దృష్టి పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment