సాక్షి, హైదరాబాద్: ‘అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చింది. కర్ణాటక తరహాలో ఉద్యమిద్దాం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెద్దాం. బీజేపీ కార్య కర్తలంతా రాబోయే రెండేళ్లపాటు తమ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించండి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. 2023లో బీజేపీని అధి కారంలోకి తెచ్చే వరకు తాను దశల వారీగా పాద యాత్రను కొనసాగించనున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనతో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని, ఆ తల్లిని విముక్తి చేయడమే లక్ష్యంగా తెగించి పోరాడాలన్నారు.
నీళ్లు–నిధులు–నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఏర్పడితే 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా గడీల పాలనతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు. ఈ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని, ప్రజల ఆకాంక్షలు, బాధలు తెలుసుకోవాలనే ఈనెల 24 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్నట్టు చెప్పారు. గురువారం పార్టీ కార్యాలయంలో తన పాదయాత్రలో పాల్గొనే కార్యకర్తలకు నిర్వహించిన వర్క్‌షాపులో బండి సంజయ్ మాట్లాడారు. ‘కేసీఆర్ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు ఝుళిపిస్తున్నారు. జైల్లో వేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందాం? ఇంకా ఎన్నాళ్లు త్యాగాలు చేద్దాం?’ అంటూ ప్రశ్నించారు.
ఒకప్పుడు కర్ణాటకలో పాలకులు కాషాయ జెండాపై కక్ష కట్టి కార్యకర్తలను జైల్లో వేశారని గుర్తుచేశారు. అయినా అక్కడి కార్యకర్తలు వెరవకుండా పాలకులపై తెగించి యుద్ధం చేసిన ఫలితంగానే కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ‘పార్టీ కోసం బూత్‌స్థాయి నుంచి ఎవరు శ్రమిస్తున్నారనే విషయాన్ని పరిశీలించేందుకే కేంద్రం నన్ను ప్రతినిధిగా పంపింది. అందరూ కష్టపడి పనిచేయాలి’ అని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్‌చార్జి, ఎంపీ మునుస్వామి చెప్పారు. ఈ వర్క్‌షాపులో పాదయాత్ర ప్రముఖ్ డా.గంగిడి మనోహర్ రెడ్డి, సహప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, డా. మల్లారెడ్డి, కట్టాసుధాకర్ పాల్గొన్నారు.
జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయండి
రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇలాంటివి జరిగినపుడు జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకునేదాకా ఒత్తిడి తేవాలని పార్టీ ఎస్సీ మోర్చా నాయకులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment