సాక్షి,కరీంనగర్‌టౌన్: బీఆర్‌ఎస్ సర్కార్ ఏం సాధించిందని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ జిమ్మిక్కు అని ధ్వజమెత్తారు. రాష్ట్రపతితో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. గతంలో రాష్ట్రపతిని ఓడించాలనుకున్నోళ్లే... ఆమెపై మొసలికన్నీరు కారుస్తుండటం సిగ్గు చేటన్నారు.
శుక్రవారం కరీంనగర్‌లో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజచేసిన సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల సొమ్మును దురి్వనియోగం చేస్తూ తెలంగాణలో కోట్ల రూపాయలతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకి పరిహారం ప్రకటించి రెండు నెలలైనా ఇప్పటికి అకౌంటులో డబ్బులు పడలేదని ఆరోపించారు. తనకు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మధ్య విభేదాలున్నాయన్నది మీడియా సృషే్టనని వివరించారు.
బీజేపీ గ్రాఫ్‌ను తగ్గించి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇమేజ్‌ను పెంచాలని దానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మీడియా లంకెపెట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గ్రానైట్ వ్యవహారంలో తనకు కోట్లు ముట్టాయని గోనెప్రకాశరావు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆయనంటే తనకు గౌరవముందని చెప్పారు. ఈనెల 30 నుంచి వచ్చే నెల 30 వరకు ‘‘ఇంటింటికీ బీజేపీ’’పేరుతో మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తీసుకెళ్తామని చెప్పారు. ఖమ్మంలో నిర్వహించే నిరుద్యోగ మార్చ్‌కు యువత తరలిరావాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment