తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేత | Be Aware With Corona Telangana Cabinet Request To People | Sakshi
Sakshi News home page

తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేత

Published Sun, Jun 20 2021 1:55 AM | Last Updated on Sun, Jun 20 2021 11:47 AM

Be Aware With Corona Telangana Cabinet Request To People - Sakshi

  • అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకోవచ్చు. 
  • సామాజిక, రాజకీయ, మతపర, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.
  • లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేయడంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగిపోయాయి.
  • ప్రార్థన స్థలాలు, సినిమా హాళ్లు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, క్లబ్బులు, స్విమ్మింగ్‌ పూల్స్, బార్లు, పబ్స్, జిమ్‌లు, స్టేడియాలు తెరుచుకోవచ్చు. 
  • వివాహాలు, అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యపై పరిమితి ఉండదు.

‘‘లాక్‌డౌన్‌ ఎత్తివేసినంత మాత్రాన కరోనా పోయినట్టు కాదు. జనజీవనం, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదు. మాస్క్‌ ధరించడం, 
భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్‌ ఉపయోగించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వ నిబంధనలను విధిగా అనుసరించాలి. పూర్తి స్థాయిలో కరోనా నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలి..’’ 

- ప్రజలకు మంత్రివర్గం విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌:  
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ సమయంలో విధించిన అన్ని రకాల ఆంక్షలను ఉప సంహరిస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌కు ముందున్నట్టుగా రోజువారీ వ్యవహారాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించింది. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పునః ప్రారంభించుకోవచ్చని తెలిపింది. శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ రాత్రి 8.30 గంటల వరకు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందంటూ, కరోనా నియంత్రణలోకి వచ్చిందంటూ వైద్యారోగ్య శాఖ అందించిన నివేదికలను పరిశీలించింది. పొరుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన అంశంపై పరిశీలన జరిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో కరోనా వేగంగా నియంత్రణలోకి వచ్చిందన్న అంశాలను నిర్ధారించుకుని.. లాక్‌డౌన్‌ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది.

వెంటనే ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో కరోనా రెండో వేవ్‌ నియంత్రణ కోసం మే 12 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఉదయం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపు ఇవ్వగా.. తర్వాత ఒంటి గంట వరకు, సాయంత్రం ఐదు గంటల వరకు పెంచారు. తాజాగా పూర్తిస్థాయిలో ఎత్తివేశారు. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ, దానికి ముందు కొనసాగిన అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. జూన్‌ 1 నుంచే విద్యా సంస్థలు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు, ఆన్‌లైన్‌ క్లాసుల కొనసాగింపు తదితర అంశాలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని విద్యా శాఖను మంత్రివర్గం ఆదేశించింది. విద్యార్థులకు భౌతిక తరగతులు (ఫిజికల్‌ క్లాసెస్‌) ప్రారంభించాలని సూచించింది. లాక్‌డౌన్‌ ఎత్తివేతతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగినా.. అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులపై మాత్రం స్పష్టత రాలేదు.

గ్రామాల్లో ఆధునిక సెలూన్లు 
యాదవులకు గొర్రెల పంపిణీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలోనే నిర్ణయించిన ప్రకారం క్షౌ ర వృత్తిలోని నాయీ బ్రాహ్మణులకు గ్రామాల్లో మోడ్రన్‌ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగా.. చేనేత, గీత కార్మికులు, ఇతర వృత్తి కులాల వారికి సైతం త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించింది. మత్స్య, గీత కార్మికులకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని, ఎంబీసీ కార్పోరేషన్‌కు నిధులు విడుదల చేయాలని 
ఆదేశించింది.
హైదరాబాద్‌లో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు 
రోగుల రద్దీతో కిటకిటలాడుతున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడం, ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందించడం లక్ష్యంగా.. కొత్తగా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రస్తుతమున్న ‘టిమ్స్‌’ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని.. కొత్తగా మరో 3 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని తీర్మానించింది. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో ఒకటి, గడ్డి అన్నారం నుంచి తరలించిన పండ్ల మార్కెట్‌ స్థలంలో మరొకటి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో అల్వాల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు మధ్య మరొకటి నిర్మించాలని నిర్ణయించింది. దీనివల్ల జిల్లాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు శివారు ప్రాంతాల్లోనే వైద్య సౌకర్యం అందుతుందని పేర్కొంది. కొత్తపేటలోని కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement