
No lockdown In South Africa: కోవిడ్ 19తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. లాక్‌డౌన్ కానీ, క్వారంటైన్ ఆంక్షలుగానీ విధించే ప్రసక్తి లేదని దక్షిణాఫ్రికా తాజాగా మీడియాకు తెల్పింది. తొందరపాటు చర్యలకు పూనుకోకుండా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆచరణయోగ్యమైన నిర్ణయాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెల్పింది. ఆంక్షల విధింపు పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, ఇతర సామాజిక అంశాలపై ప్రమాదకర ప్రభావాన్ని చూపుతున్నాయని దక్షిణాఫ్రికా వైద్య నిపుణులు జనవరి 9న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విధించిన కోవిడ్ -19 ఆంక్షలను ప్రభుత్వం గుడ్డిగా అనుసరించకూడదని, స్థానికంగా అవి ఆచరణ యోగ్యంకాదని, అవి కేవలం నామమాత్రపు ప్రయోజనాలను మాత్రమే ఇస్తాయన్నారు.
కాగా దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకూ 93 వేల కోవిడ్ మరణాలు సంభవించగా, 33,60,879 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,02,476 కోవిడ్ యాక్టీవ్ కేసులున్నాయి. మొత్తం 35 లక్షల (3.5 మిలియన్లు) కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే! దీంతో ప్రస్తుతం దేశంలో కోవిడ్ నాలుగో వేవ్‌లో కొట్టుమిట్టాడుతోంది. కొత్త వేరియంట్ దాటికి ప్రపంచ దేశాలు గజగజలాడిపోతుంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించడానికి బదులు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
అధిక స్థాయి లాక్‌డౌన్‌లకు వెళ్లకుండా, తక్షణ ఆరోగ్య ముప్పు పొంచి ఉందా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం దృష్టి నిలిపిందని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా ఒమిక్రాన్‌కు ముందు వచ్చిన కోవిడ్ మూడు వేవ్‌లు సహజ సంక్రమణల ద్వారా రోగనిరోధక శక్తి బలం పుంజుకుందని వారు తెలిపారు. ఒమిక్రాన్ ప్రమాదాన్ని టీ సెల్ ఇమ్యునిటీ ఎదుర్కొంటుందన్నారు. అయినప్పటికీ దేశంలో తక్కువ స్థాయిలో నమోదవుతున్న కోవిడ్ 19 పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని అధిక రిస్క్ గ్రూపుల కోసం బూస్టర్ డోస్‌లతో సహా వ్యాక్సినేషన్ ప్రక్రియలను పెంచడం, ఐసోలేషన్ వంటి ఆచరణాత్మక విధానాలను ప్రభుత్వం ఎంచుకోవాలని నిపుణులు సూచించారు. చేతి పరిశుభ్రత, థర్మల్ స్క్రీనింగ్, అవుట్‌డోర్ స్పోర్ట్స్ ఈవెంట్‌లకు అనుమతించకపోవడం, వెంటిలేషన్ లేని ఇండోర్ ప్రదేశాలలో మాస్కులు ధరించడం, తగినంత వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవడంపై అక్కడి ప్రభుత్వ దృష్టి నిలిపింది.
Comments
Please login to add a commentAdd a comment