
హుస్నాబాద్ పట్టణంలో సీసీ ఫుటేజీలో రికార్డయిన ఎలుగుబంటి సంచార దృశ్యం
హుస్నాబాద్: అటవీ ప్రాంతంలో తిరగాల్సిన ఎలుగుబంటి జనావాసాల్లో సంచరించడంతో పట్టణ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తాలో సంచరించడాన్ని స్థానికులు చూసి బెంబెలెత్తిపోయారు. తెల్లవారుజామున కోళ్ల వ్యర్థ పదర్థాలను తరలిస్తున్న వారు చూసి 100 డయల్‌కు చేయగా బ్లూకోడ్ సిబ్బంది వచ్చారు.
మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు కట్ట వైపునకు ఎలుగుబంటి వెళ్తుండటంతో దాని వెంట బ్లూకోడ్ సిబ్బంది వెళ్లారు. పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరా కంట్రోల్ రూంలో సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. మంగళవారం తెల్లవారు జామున 3.47 గంటలకు అంబేడ్కర్ చౌరస్తా నుంచి మల్లెచెట్టు చౌరస్తాకు చేరుకుంది. అక్కడి నుంచి ఎల్లమ్మ చెరువు కట్ట వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది. తెల్లవారు జామున రోడ్లపై జనం లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.