
భైంసా ఘటనలు దురదృష్టకరమని.. రాజకీయ లబ్ధి కోసమే
భైంసా/ భైంసా టౌన్/ భైంసా రూరల్: నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘటనలు దురదృష్టకరమని, రాజకీయ లబ్ధి కోసమే కొందరు టీఆర్‌ఎస్‌పై బురద జల్లుతున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకీతో కలసి శనివారం ఆయన భైంసా మండలం మహాగాంలో పర్యటించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘటనలో ఆస్తులు నష్టపోయిన బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి భైంసాకు చేరుకుని స్థానిక బస్టాండ్ వద్ద దహనమైన దుకాణ సముదాయాలను పరిశీలించారు.
అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అల్లర్ల వెనుక ఏ రాజకీయ పార్టీకి చెందినవారు ఉన్నా ఉపేక్షించేది లేదని అన్నారు. తరచూ జరుగుతున్న ఘర్షణలు ఈ ప్రాంత అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో భైంసా పట్టణంపై దృష్టి సారించిందని తెలిపారు. ఇలాంటి సమయంలో భైంసా ప్రజలకు అండగా నిలిచేది పోయి రాజకీయం చేయడం పద్ధతి కాదన్నారు.