అందరితో చర్చించాకే నూతన విద్యుత్‌ పాలసీ | Bhatti Vikramarka announces completion timeline for Yadadri Thermal Power Plant | Sakshi
Sakshi News home page

అందరితో చర్చించాకే నూతన విద్యుత్‌ పాలసీ

Published Mon, Nov 4 2024 1:58 AM | Last Updated on Mon, Nov 4 2024 1:58 AM

Bhatti Vikramarka announces completion timeline for Yadadri Thermal Power Plant

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో యూనిట్‌–1 సింక్రనైజేషన్‌ ప్రారంభం

పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

మిర్యాలగూడ/గరిడేపల్లి: రాష్ట్రంలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీని ప్రవేశపెట్టబోతున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న విద్యుత్‌ నిష్ణాతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలందరి ప్రజాభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీలో చర్చిస్తామన్నా రు. ఆదివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి యూనిట్‌–1 సింక్రనైజేషన్‌ కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విలేకరులతో మాట్లాడారు.

2025 మే నాటికి యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ద్వారా పూర్తిస్థాయి లో 4వేల మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. 2028–29 నాటికి రాష్ట్రవ్యా ప్తంగా 22,488 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండొచ్చని అంచనాలను రూపొందించామని చెప్పారు. ఇది 2034–35 నాటికి 31,809 మెగావాట్లకు పెరిగే అవకాశముందని అంచనా వేసినట్టు తెలిపారు. రాష్ట్ర పురోభివృద్ధి, వ్యవసాయ, పరిశ్రమ, గృహ అవసరాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఏ రంగంలోనూ విద్యుత్‌ సమస్య రాకుండా పక్కా ప్రణాళికలతో ముందుకుపోతున్నామన్నారు. 

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీని ప్రవేశ పెట్టనున్నామని, ఇందుకు తగ్గట్టుగా విద్యుదుత్పాదన చేపట్టి రాష్ట్రాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉంచుతామని చెప్పారు. అంతకుముందు దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు బొగ్గు అందించే ర్యాకుల రైల్వే వ్యాగన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, వైటీపీఎస్‌ చైర్మన్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, వైటీపీఎస్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ అజయ్, ప్రాజెక్టు డైరెక్టర్‌ సచ్చిదానంద, చీఫ్‌ ఇంజనీర్‌ సమ్మయ్య, టీపీసీ సీఈ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సంక్రాంతి తర్వాత రేషన్‌కార్డులకు సన్నబియ్యం: ఉత్తమ్‌
కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ కార్డుదారులందరికీ సన్నబియ్యం అందించనున్నట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దేశంలో ఉన్నతమైన పదవులు చేపట్టి భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఉత్తమ్‌ ఆకాంక్షించారు.

రూ.7లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్‌: కోమటిరెడ్డి
రాష్ట్రంలో రూ.7లక్షల కోట్లు అప్పు చేసి మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే 24గంటలు అందుబాటులో ఉంటూ సీఎం, మంత్రులు తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తు న్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఐదుగురు ఎమ్మెల్యేలతో పోరాడి పాద యాత్ర చేసి తెలంగాణ ప్రజల కష్టాలను తెలుసుకున్న వ్యక్తి అన్నారు. 

నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పరిశీలన
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పరిశీలించారు.

రూ.5వేల కోట్లతో రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణం
రాష్ట్రవ్యాప్తంగా రూ.5వేల కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణం చేపడుతున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో రూ. 200 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణానికి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో కలిసి జరిగిన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి విధానాలతో అన్ని రకాల సౌకర్యాలు విద్యా విధానాలు అందుబాటులో ఉండేలా వీటి నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌ విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులకు కూడా ఈ పాఠశాలలోనే క్వార్టర్స్‌ నిర్మిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ సొరంగాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. తాను మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో కలిసి ఎస్‌ఎల్‌బీసీ దగ్గర సమీక్ష చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement