సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్య వాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ‘అధ్యక్షా.. మాస్క్ తీయొచ్చా. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది’ అని భట్టి విక్రమార్క.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనుమతి కోరారు. ‘మాస్క్ తీయండి.. కానీ, సమయంలోపల ముగించండి’ అని స్పీకర్ సూచించగా ‘సీఎంగారు.. ఎంత సేపైనా మాట్లాడొచ్చు అంటారు. మీరేమో మైక్ కట్ చేస్తారు. సమయం లోపల ముగించాలం టారు ఎలా’అని భట్టి ప్రశ్నించారు. సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సమయం కేటాయిస్తామని స్పీకర్ సమాధానం ఇవ్వగా, సంఖ్యతో పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా ముఖ్యమని భట్టి వ్యాఖ్యానించారు. తాము మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని, ప్రతిపక్షాలను బతికించక పోతే ప్రజాస్వామ్యం చనిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నిర్దేశించిన సమయంలోపు ప్రసంగం ముగించక పోవడంతో భట్టి విక్రమార్క మైక్‌ను స్పీకర్ కట్ చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వాగ్వివాదానికి దిగారు. రెండుమూడు పర్యాయాలు అవకాశం ఇచ్చినా భట్టి ప్రసంగం ముగించక పోవడంతో మరోమారు మైక్ కట్ చేశారు. దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో సమస్యలున్నప్పుడు సహజంగా శాసనసభ్యులు, విపక్ష నాయకులు సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకుంటారు. మీరెందుకు కలవరు?’అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. సీఎంను కలుస్తామని రాత పూర్వకంగా విజ్ఞాపనను పంపించానని, కలి సేందుకు ఎందుకు అవకాశమివ్వలేదని నిలదీశారు. ‘ఇది సరైంది కాదు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి లేదా రికార్డుల నుంచి తొలగించాలి’అని సీఎం కేసీఆర్.. భట్టి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సందర్భం కాని ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతున్న సమయంలో పలుమార్లు అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
భట్టికి కేటాయించిన సమయం అయిపోగా, ఆయన పలుమార్లు మరింత సమయం కోసం పట్టుబట్టారు. తమకు సభలో మాట్లాడానికి సమయం ఇవ్వట్లేదని, మేము సభకు రావద్దని సీఎంను చెప్పమనండి అంటూ ఆయన నిరసన తెలియజేశారు. దీంతో ఒక దశలో సీఎం కేసీఆర్ కలుగజేసుకుని, భట్టి ప్రతి సమావేశంలో ఇలా చేయడం పరిపాటి అయిపోయిందన్నారు. ఈ నెల 26 వరకు సభ జరుగుతుందని, మాట్లాడటానికి చాలా అవకాశాలు లభిస్తాయన్నారు. మేము సభకు రావొద్దని సీఎంని చెప్పమనండని భట్టి అనడమే మిటి? మిమ్మల్ని రావొద్దని మేమెందుకు అంటాం. యూ ఆర్ వెల్‌కమ్... అని సీఎం కౌంటర్ ఇచ్చారు. ‘నలుగురు (కాంగ్రెస్) సభ్యులు సభను హైజాక్ చేసేలా వ్యవహరించడం సరికాదు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బేషర తుగా క్షమాపణ చెప్పాలి’అని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పడానికి తప్పేమీ చేయలేదని భట్టి ప్రతిస్పందించారు.
పంటల కొనుగోళ్లపై హామీ ఇవ్వండి
కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏం ఉన్నా సంబంధం లేకుండా రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర ఇస్తామని, పంటల కొనుగోళ్లు కొనసాగిస్తామని హామీ ఇవ్వాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. రుణమాఫీ జరగక, పాత రుణాలు రీషెడ్యూల్ కాక రైతులకు కొత్త రుణాలు లభించట్లేదని అన్నారు. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన 2018 నుంచి లభించట్లేదన్నారు. రూ.960 కోట్లు బీమా రావాల్సి ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని కోరారు. టమాటా రైతుల కోసం సరైన మార్కెటింగ్ విధానం రూపకల్పన చేయాలన్నారు. కేవలం మద్యం అమ్మకాలు, అప్పులు తెచ్చుకోవడంలోనే ప్రగతి కనిపిస్తోందని, మరెక్కడా ప్రగతి లేదని భట్టి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇంతవరకు గ్రూప్–1 నోటిఫికేష¯Œ రాలేదని, 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ కమిటీ తన నివేదికలో చెప్పిందని భట్టి పేర్కొన్నారు.
పెట్రో, డీజిల్ ధరలు కట్టడి చేయండి
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ప్రమాదకరంగా పెరిగిపోయాయని, దీంతో నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. లీటర్ పెట్రోల్ బేసిక్ ధర రూ.34.68 ఉంటే కేంద్రం రూ.32.90, రాష్ట్రం రూ. 23.79 పన్నులు విధిస్తున్నాయన్నారు. లీటర్ డీజిల్ బేసిక్ ధర రూ.36.42 ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం రూ.18.42, కేంద్రం రూ.31.08 పన్నులు విధిస్తున్నాయని దుయ్యబట్టారు.
వామన్‌రావు హత్యపై స్పందించరేం?
న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతులను పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపారని, ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మేము ఏం చేసినా మాకు ఏమీ కాదు.. మా వెనక చాలా పెద్ద అండ ఉందన్న ధీమాతో నిందితులు ఈ హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. శీలం రంగయ్య అనే దళితుడు మంథని పోలీస్‌స్టేషన్‌లో చనిపోతే న్యాయవాది నాగమణి హైకోర్టులో పిల్ వేయడంతోనే వీరిని హత్య చేశారని ఆరోపించారు.
చెప్పాల్సింది చెప్పాం.. నిర్ణయం కేంద్రానిదే: సీఎం
‘కేంద్ర ప్రభుత్వ విధానాలు, చట్టాలపై ఒక లిమిట్ వరకే మనం చర్చించగలుగుతాం. రాష్ట్ర పరంగా మేము చెప్పాల్సింది సభ నుంచి, బయట నుంచి చెప్పాం. తదనంతరం కేంద్రానిదే అంతిమ నిర్ణయం. మీ పార్టీ (కాంగ్రెస్) అక్కడ ఉంది. పార్లమెంట్‌లో మాట్లాడమనండి. దీని కంటే రాష్ట్రానికి సంబంధించిన విషయాలు సభలో మాట్లాడితే మంచిది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై శాసనసభలో చర్చ నిర్వహించి, వీటికి వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని భట్టి విక్రమార్క కోరగా... కేసీఆర్ పైవిధంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment