తెలంగాణ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం విస్మయం
కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీకి మెజార్టీ స్థానాలు దక్కడంపై కలవరం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుకున్న లక్ష్యాలకు పూర్తి భిన్నంగా ఫలితాలు రావడంపై ఆ పార్టీ హైకమాండ్ విస్మయం వ్యక్తం చేసింది. ఆరు నెలల కిందటే అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మొత్తం 17 సీట్లకు గానూ 14 సీట్లు వస్తాయని భావించినా, కేవలం 8 సీట్లు రావడం, అంతగా క్షేత్రస్థాయి బలం లేని బీజేపీ ఏకంగా 8 స్థానాలను గెలవడం పార్టీ పెద్దలను కలవరానికి గురి చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఈ ఫలితాల ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర నేతలతో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సీఎం సొంత జిల్లాలోనూ ఓటమా?
తెలంగాణలో ప్రస్తుత ఎన్నికల్లో కనీసంగా 14 సీట్లు గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలను కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సూచించింది. హైకమాండ్ సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణను రూపొందించుకొని అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం, బూత్, పోల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలకు మంత్రులకు కట్టబెట్టింది. ఇందులో భాగంగా సీఎం స్వయంగా తన సొంత జిల్లా మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఇంచార్జిగా వ్యవహరించారు. ఆ జిల్లాలోనే పకడ్భందీగా వ్యవహరించినప్పటికీ ఏఐసీసీ కార్యదర్శి, అభ్యర్ధి వంశీచంద్‌రెడ్డి ఓటమి పాలవ్వడంపై హైకమాండ్ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లోక్‌సభ పరిధిలో ఏడుకు ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ అభ్యర్ధి ఓడటంపై
వారు స్వయంగా ముఖ్యమంత్రినే ఆరా తీసినట్లు తెలసింది.
మల్కాజిగిరిలో బీజేపీకి 3లక్షలు మెజారిటీనా?
ఇక గతంలో సీఎం రేవంత్ స్వయంగా గెలిచిన మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ ఓడటం,, బీజేపీ అభ్యర్ధికి ఏకంగా 3 లక్షల పైచిలుకు మెజార్టీ రావడంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. కేవలం ఆరు నెలల వ్యవధిలో ఇంతమార్పు ఎందుకు జరిగింది?, పార్టీ నేతల మధ్య సమన్వయం లేదా?,మరే ఇతర కారాణాలున్నాయా? అని ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. చాలామంది రాష్ట్ర నేతలు బీజేపీ గాలి వీచిందని చెప్పగా, అభ్యర్థుల ఎంపికలో తొందరపాటు నిర్ణయాలు ఉన్నాయని మరికొందమంది చెప్పినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా చేవెళ్ల, మల్కాజ్‌గిరి, కరీంనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల ఎంపిక పూర్తి ఏకపక్షంగా జరిగిందనే వాదనను కొందరు తెరపైకి తెచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment