
రాజీవ్ రహదారిపై సిద్దిపేట వైపు అమర్చిన బో స్ట్రింగ్ గర్డర్
సాక్షి, హైదరాబాద్: మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గంలో రాజీవ్ రహదారిపై ధనుస్సు ఆకారంలో ఉండే ఓ స్టీల్ వంతెన రూపుదిద్దుకుంటోంది. తొలుత ఈ మార్గంలో గజ్వేల్ ఔటర్ రింగురోడ్డుపై ఓ వంతెన నిర్మించగా, ఇప్పుడు దానికంటే మరింత పెద్దదైన ఈ వంతెనను సిద్దిపేట మార్గంలో కుకునూరుపల్లి శివారులో దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. గజ్వేల్ దాటిన తర్వాత కుకునూరుపల్లి పొలిమేరలో రాజీవ్ రహదారిని మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ దాటుతుంది.
మనోహరాబాద్–కొత్తపల్లి సింగిల్‌లైన్ భవిష్యత్తులో మరో రెండు లైన్లకు విస్తరించాల్సి ఉంటుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు లైన్లకు వీలుగా ‘బో స్ట్రింగ్ గర్డర్’పద్ధతిలో నిర్మిస్తోంది. ఇది కాంక్రీట్‌తో సంబంధం లేకుండా పూర్తిగా స్టీల్‌తో రూపొందుతోంది. 60 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 10.5 మీటర్ల ఎత్తుతో ఉండే భారీ స్టీల్ వంతెనను రోడ్డుతో అనుసంధానిస్తారు. ఇలా హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు దారిలో ఒకటి, సిద్దిపేట నుంచి హైదరాబాద్ దారిలో మరోటి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం సిద్దిపేట వైపు దారిలో దాన్ని బిగిస్తున్నారు. ఒక్కోటి 550 టన్నుల బరువుండే స్టీల్‌తో రూపొందించారు.
నెలలోగా పూర్తి..
సిద్దిపేట వైపు ఉన్న రోడ్డులో ధనుస్సు ఆకారంలో ఉండే స్టీల్ గర్డర్ ఏర్పాటు పూర్తయింది. దానిమీద 8 ఎంఎం మందంతో స్టీల్ షీట్ అమర్చే పని జరుగుతోంది. రెండురోజుల తర్వాత దానిమీద 250 ఎంఎం మందంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మిస్తారు. నెలరోజుల్లోగా ఈ మార్గంలో వాహనాలకు అనుమతిస్తారు. సిద్దిపేట –హైదరాబాద్ రోడ్డు భాగంలో రెండో గర్డర్ రెండు వైపులా రెండు అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు.
వంతెన మీద నుంచి వాహనాలు కిందకు రావటానికి, కిందినుంచి వంతెన మీదకు వెళ్లేందుకు వీలుగా వాటిని నిర్మిస్తున్నారు. గజ్వేల్ శివారులో ఔటర్ రింగురోడ్డును క్రాస్ చేసేందుకు వీలుగా ఇదే పద్ధతిలో చిన్న పరిమాణంలో ఉండే బో స్ట్రింగ్ గర్డర్‌లతో వంతెన నిర్మాణం పూర్తయింది. దానికి అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది.
సిద్దిపేట వద్ద బాక్స్ బ్రిడ్జ్..
కుకునూరుపల్లి వద్ద రైల్వే లైన్ రాజీవ్ రహదారిని క్రాస్ చేస్తుండగా, మళ్లీ సిద్దిపేట బైపాస్ దాటగానే మరోసారి క్రాస్ చేస్తుంది. అక్కడ కూడా వెంతెన నిర్మించాల్సి ఉంది. అయితే అక్కడ, రైల్వే లైన్ రోడ్డు పై నుంచి నిర్మిస్తారు. ఇందుకుగాను నగరంలోని ఒలిఫెంటా వంతెన తరహాలో బాక్సు నమూనా వంతెన నిర్మించనున్నారు. సిమెంట్ క్రాంక్రీట్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బాక్సు రూపొందించి దాని వీదుగా రైల్వే లైన్ దాటేలా ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment