పెళ్లిలో బిడ్డ,అల్లుడికి కాళ్లు కడుగుతున్న వసంత, రాజన్న
నిర్మల్/కడెం: పెళ్లిపందిరి ఇంకా పచ్చగానే ఉంది. పెళ్లికూతురు కాళ్లపారాణి ఆరనేలేదు. పెళ్లి సంబురం తీరనేలేదు. ఇంతలోనే.. ఆ పచ్చటిపందిరి కింద పెళ్లికూతురు, ఆమె తండ్రి విగతజీవులై ఉన్నారు. ఈ హృదయవిదారక ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగలో చోటుచేసుకుంది. పాత మద్దిపడగకు చెందిన కొండ రాజన్న(50), వసంత దంపతులు. వీరి ఏకైక సంతానం మౌనిక(22). రాజన్న ఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లి ఏడాది క్రితమే తిరిగివచ్చారు.
భార్య వసంత ఊళ్లోనే కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని నడిపేది. మౌనిక హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షా సమీపంలోని రాజూరాకు చెందిన సింగరేణి ఉద్యోగి జనార్దన్‌తో మౌనికకు ఈ నెల 25న పెళ్లి జరిగింది.
పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా..
27న రాజూరాలో జనార్దన్ కుటుంబం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో రాజన్న కుటుంబంతోపాటు బంధుమిత్రులంతా పాల్గొన్నారు. అనంతరం నవదంపతులతోపాటు అదేరోజు రాత్రి పాతమద్దిపడగకు బయల్దేరారు. సరిగ్గా పదినిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా అనుకోని ఘోరం జరిగింది. కడెం ప్రాజెక్టు దిగువన పాండ్వాపూర్ బ్రిడ్జి వద్ద వీరు ప్రయాణిస్తున్న ఎర్టిగ వాహనం రాంగ్‌రూట్లో వెళ్లి కల్వర్టు మూలను బలంగా ఢీకొంది. వాహనం పల్టీలు కొడుతూ రోడ్డు దిగువన పడిపోయింది. అర్ధరాత్రి కావడంతో అందరూ నిద్రమత్తులోనే ఉన్నారు.
తేరుకునేలోపే భర్త భుజంపై తలవాల్చి పడుకున్న కొత్త పెళ్లికూతురును మృత్యువు మింగేసింది. తన బిడ్డను విడిచి ఉండలేనన్నట్లు రాజన్న కూడా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. వసంత, జనార్దన్‌కు స్వల్పగాయాలయ్యాయి. బంధువుల అమ్మాయికి, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అమ్మాయి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్ తరలించారు.
అతివేగం, నిద్రమత్తు..
వాహనం అతివేగంగా వెళ్తుండటంతోపాటు డ్రైవర్‌ను నిద్రమత్తు ఆవరించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కడెం ప్రాజెక్టు కిందకు పల్టీ కొట్టిన వాహనం నదికి కొంతదూరంలోనే ఆగింది. అది నది నీళ్లలో పడి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment