
నేడు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటన
ఎండిన పంట పొలాల పరిశీలన
నష్టపోయిన రైతులతో ముఖాముఖి
సాక్షి, హైదరాబాద్: సాగునీరు అందక, భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ పర్యటన ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తారు.
పర్యటనలో భాగంగా పంట పొలాలను పరిశీలించడంతోపాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. కేసీఆర్ ఉదయం 8:30 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గంలో జిల్లాల పర్యటనకు బయలుదేరతారు. 10:30 గంటలకు చేరుకుని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం జనగామ, సూర్యాపేట మార్గంలో ప్రయాణించి 11:30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. అక్కడ 2 గంటలకు భోజనం చేసి 3 గంటలకు మీడియాతో మాట్లాడతారు. 3:30 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి 4.30కు నల్లగొండ జిల్లా నిడమనూరులో పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతీ చోటా రైతులతో ముఖాముఖి సంభాషిస్తారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి బయల్దేరి నల్లగొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, భువనగిరి మీదుగా ఎర్రవెల్లి ఫాంహౌజ్‌కు రాత్రి 9 గంటలకు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment