సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రే ఓటుకు నోటు కేసులో దొరికిన ఓ దొంగ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు వస్తే వాస్తవాలను బయటపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కుంగిందని, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని దుయ్యబట్టారు. చిన్న చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపాలి కానీ దాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై పగ పట్టినట్లుగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
అయోమయంగా కాంగ్రెస్ పాలన
కాంగ్రెస్ సర్కార్ రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజాపాలన అందిస్తామంటూ పగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్.. జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ సమావేశం, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు జరగకుండా ఆపుతోందని దుయ్యబట్టారు. ఫార్మాసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతింటుందన్నారు. 60 రోజుల కాంగ్రెస్ పాలన అయోమయంగా ఉందన్నారు. 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు 420 హామీల అమలుకు రూ. 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కోసం రూ. 50వేల కోట్లకుపైగా అవుతుందన్నారు. రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో బడ్జెట్‌లో చెప్పలేదని కేటీఆర్ ఉద్ఘాటించారు.
పార్టీ మారితే వచ్చే నష్టమేమీ లేదు
ఒక్కరో ఇద్దరో పార్టీ మారితే వచ్చే నష్టం ఏమీ లేదని.. అది వారి ఖర్మ అని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే టికెట్లు ఆశించి.. రాజకీయ కారణాలతో అవకాశం రాకున్నా పార్టీ కోసం నిబద్ధతతో పని చేశారన్నారు. ప్రతీ కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషితోనే నగరంలో బీఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందని గుర్తు చేశారు.
అధికారులు సహకరించడం లేదు: మేయర్
రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నగర అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు, జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించే అంశాన్ని నిర్ణయించడం కోసమే ముఖ్యమంత్రిని కలిశానన్నారు. ఒక సాధారణ కార్పొరేటర్‌గా ఉన్న తనకు పార్టీ మేయర్‌గా అవకామిచి్చందన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment