సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. శనివారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడింది. గత నెల రోజులుగా హోరెత్తిన లౌడ్ స్పీకర్లు, మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఈ నెల 13న సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. శనివారం సాయంత్రం నుంచి సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని, ఎక్కడా నలుగురుకి మించి గూమికూడి ఉండరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించారు.
బల్క్ ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం
బల్క్ ఎస్‌ఎంఎస్‌లతో పాటు టీవీ చానళ్లు, రేడియో, ఇతర మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచార కార్యక్రమాల ప్రసారంపై నిషేధం అమల్లోకి వచ్చిందని వికాస్‌రాజ్ తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ 1 సాయంత్రం వరకు వెల్లడించరాదన్నారు. శనివారం ఆయన బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లను వెల్లడించారు. సోమవారం జరగాల్సిన పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామన్నారు.
ఎక్కడికక్కడ గట్టి నిఘా
పోలింగ్‌కి ముందురోజు ఆదివారం రాత్రి వేళల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీని అడ్డుకోవడం తమకు కీలకమని, ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచామని, అన్ని ట్రాన్స్‌పోర్ట్, కమర్షియల్ వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.320 కోట్లు విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సీ–విజిల్ యాప్, ఎన్‌జీఎస్పీ పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి 100 నిమిషాల్లోగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో మొత్తం 8600 కేసులు నమోదు చేయగా, అందులో 293 కేసులు నగదుకి సంబంధించినవి, 449 కేసులు ఐపీసీ, 7800 కేసులు మద్యానికి సంబంధించినవి అని వివరించారు.
పోస్టర్ బ్యాలెట్‌లో అభ్యర్థిని చూడాలి..
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం మినహా మిగిలిన 16 లోక్‌సభ స్థానాల పరిధిలో రెండు, లేదా మూడు బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు జరుగుతాయని, ఓటర్లు గందరగోళానికి గురికావద్దని, పోలింగ్ కేంద్రం బయట ప్రదర్శనకు ఉంచిన పోస్టర్ బ్యాలెట్‌లో తాము ఓటేయాల్సిన అభ్యర్థిని ముందే గుర్తించాలని వికాస్‌రాజ్ సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.88లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని, వీరిలో 20,163 మంది ఇంటి వద్ద నుంచే ఓటేశారన్నారు. రాష్ట్రంలో తక్కువ పోలింగ్ జరిగే 5వేల పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడి ప్రజలు ఓటేసేలా చైతన్యపరిచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 35,809 పోలింగ్ కేంద్రాలుండగా, అందులో 9900 సమస్యాత్మకమైనవి అని, అక్కడ కేంద్ర బలగాలు, సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు.
సోమవారం ఉదయం 5.30 కి మాక్‌పోల్
సోమవారం ఉదయం 5.30 గంటలకు పోలింగ్ కేంద్రంలో మాక్‌పోల్ నిర్వహిస్తారని, అభ్యర్థుల ఏజెంట్లు అందరూ అందుబాటులో ఉండాలని వికాస్‌రాజ్ సూచించారు. మాక్‌పోల్/పోలింగ్ నిర్వహించేటప్పుడు ఈవీఎంలు పనిచేయకపోతే సెక్టోరల్ అధికారులు వచ్చి మారుస్తారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ స్థానం పరిధిలో ఇద్దరు, ముగ్గురు ఈసీఐఎల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలకు పోలీసుల భద్రతతో పాటు వాటి కదలికలను జీపీఎస్ ద్వారా జిల్లా కలెక్టర్లు నిరంతరం సమీక్షిస్తారన్నారు.
కచ్చితమైన పోలింగ్ శాతం తెలిసేది మరుసటి రోజే..
పోలింగ్ ప్రారంభమైన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి అంచనా పోలింగ్ శాతాన్ని అందిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ ముగిసాక సాయంత్రం 6 గంటలకు మొత్తం పోలింగ్ శాతంపై తొలి అంచనాను, రాత్రి అయ్యాక సవరించిన అంచనాలను ప్రకటిస్తామన్నారు. మరుసటి రోజు కచ్చితమైన పోలింగ్ శాతం వెల్లడిస్తామన్నారు.
విద్వేష ప్రసంగాలపై దాటవేత ధోరణి..
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఇతర బీజేపీ నేతలు విద్వేష ప్రసంగాలు చేశారని, ప్రచారంలో చిన్నపిల్లలను వాడుకున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు వికాస్‌రాజ్ సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ప్రత్యేకంగా ఒక్కో ఫిర్యాదు విషయంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం తన వద్ద ఇప్పుడు లేదన్నారు. రాజకీయ పార్టీల నుంచి మొత్తం 92 ఫిర్యాలొచ్చాయని, ఇద్దరు వ్యక్తులపై ఈసీ ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఫిర్యాదుల విషయంలో రాజకీయ పార్టీలకు నోటిసులు జారీ చేశామని, వివరణ కోసం వారు మరికొంత సమయం కోరినట్టు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో వాడనున్న ఈవీఎంలు
బ్యాలెట్ యూనిట్లు – 84,577+ 20వేలు రిజర్వ్
కంట్రోల్ యూనిట్లు – 35,809+ 10వేల రిజర్వ్
వీవీప్యాట్స్ – 35,809 + 15వేలు రిజర్వ్
పోలీసుల బందోబస్తు
కేంద్ర బలగాలు –160 కంపెనీలు
పొరుగు రాష్ట్రాల నుంచి హోంగార్డులు, ఇతర బలగాలు– 20వేల మంది
రాష్ట్ర పోలీసులు 60వేల మంది
ఇతర రాష్ట్ర యూనిఫార్మ్ సర్వీసుల సిబ్బంది– 12 వేల మంది
Comments
Please login to add a commentAdd a comment