స్మార్ట్‌ సిటీలు.. కావాలా..వద్దా? | Central Govt Questions Telangana Govt Stance On Smart Cities Project | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ సిటీలు.. కావాలా..వద్దా?

Published Thu, Dec 24 2020 4:31 AM | Last Updated on Thu, Dec 24 2020 8:52 AM

Central Govt Questions Telangana Govt Stance On Smart Cities Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ వరంగల్, కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా వీటికి విడుదల చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి లేకపోతే ఈ రెండు నగరాలను స్మార్ట్‌సిటీల జాబితా నుంచి తొలగించి కొత్తవాటిని ఎంపిక చేస్తామని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ తెలంగాణ సర్కారుకు తేల్చిచెప్పింది. ఇందుకువీలుగా ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటివరకు విడుదల చేసిన నిధులను వెనక్కి ఇచ్చేయాలని కోరింది. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్య దర్శి దుర్గాశంకర్‌ మిశ్రా గత జూన్‌ 4న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు ఈ మేరకు ఓ లేఖను రాశారు.

ఇది ఆలస్యంగా వెలుగుచూసిం ది. లేఖ రాసేనాటికి గ్రేటర్‌ వరంగల్, కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులకు కేంద్రం రూ.196 కోట్ల చొప్పున విడుదల చేసింది. అంతే మొత్తం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా... తామిచ్చిన నిధులనూ పూర్తిగా బదలాయించకుండా అట్టిపెట్టుకోవడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. స్మార్ట్‌ సిటీ మిషన్‌ మార్గదర్శకాల ప్రకారం కేంద్రం విడుదల చేసిన నిధులను ఏడు రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్పీవీ)కు బదలాయించాల్సి ఉంటుందని, సమాన మొత్తంలో రాష్ట్ర వాటా నిధులను ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేసింది.

తక్షణమే ఈ నిధులను ఎస్పీవీలకు అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు కేంద్రం సూచించింది.   2016 మేలో గ్రేటర్‌ వరంగల్, ఆగస్టులో కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసింది. వీటికి నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ కేంద్రం లేఖ రాసి 5 నెలలు గడిచిపోయిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై ‘సాక్షి’దృష్టిసారించింది. ఆ వివరాలివి....  

గ్రేటర్‌ వరంగల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌
►స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అంచనా వ్యయం: రూ.2,350 కోట్లు 
►పనుల ప్రారంభం 2017 నవంబర్‌ 17  
►మొత్తం ప్రాజెక్టులు: 94 
►పనులు పూర్తయిన ప్రాజెక్టులు 17. ఖర్చు చేసిన నిధులు రూ.61.35 కోట్లు 
►పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పనులు 32. అవసరమైన నిధులు రూ.1,271 కోట్లు 
►టెండర్‌ దశలో 14 ప్రాజెక్టులు, అంచనా వ్యయం రూ.359 కోట్లు 
►డీపీఆర్‌లు ఆమోదించిన ప్రాజెక్టులు 14. అంచనా వ్యయం రూ.66.12 కోట్లు 
►డీపీఆర్‌ తయారీ దశలో 17 ప్రాజెక్టులు. అంచనా వ్యయం రూ.592 కోట్లు.

సీఎం హామీల అమలుకు ఇప్పటికే చాలా నిధులు ఇచ్చాం 
రాష్ట్రానికి మంజూరు చేసిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను రద్దు చేస్తామని కేంద్రం రాసిన లేఖ పాతది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులను వరంగల్, కరీంనగర్‌ కార్పొరేషన్లకు విడుదల చేశాం. పనుల పురోగతిని బట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను విడుదల చేస్తాం. ఈ రెండు నగరాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఇప్పటికే చాలా నిధులను విడుదల చేశాం.       – అరవింద్‌కుమార్, రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి      

రూ.196 కోట్లకు 138 కోట్లు మాత్రమే జమ 
కేంద్ర ప్రభుత్వం వరంగల్‌ స్మార్ట్‌సిటీ మిషన్‌ అంచనా వ్యయంలో ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేసింది. ఇందులో స్మార్ట్‌సిటీ ఖాతా (ఎస్పీవీ)కు రూ.138 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. మరో రూ.58 కోట్లు జమ కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.500 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. గ్రేటర్‌ వరంగల్‌లో భద్రకాళి చెరువు రీ జనరేషన్‌ ల్యాండ్‌ స్కేపింగ్, బండ్‌ రిటర్నింగ్‌ వాల్, 13 ట్రాఫిక్‌ సిగ్నల్స్, ఏంజీఎంలో 750 కేఎల్‌డీ మురుగునీటి శుద్దీకరణ ప్లాంటు, రీజినల్‌ లైబ్రరీ పునరుద్ధరణ, సుబేదారి జంక్షన్‌ పుట్‌పాత్‌ పనులు పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఫస్ట్‌ఫేజ్‌లో 4 స్మార్ట్‌సిటీ రోడ్లు (3.95 కిలోమీటర్లు) పనులు పురోగతిలో ఉన్నాయి. 10.62 కిలోమీటర్ల అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు నడుస్తున్నాయి. రూ.26.5 కోట్లతో నాలుగు ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాల పను లు పురోగతిలో ఉన్నాయి. రూ.65.5 కోట్లతో భద్ర కాళి బండ్‌ పనులు నడుస్తున్నాయి. రూ.8.36 కోట్లతో స్వీపింగ్‌ మిషన్లు, ఇతర వాహనా లను కొనుగోలు చేశారు. 

కేంద్రం ఇచ్చినా... రాష్ట్రం వద్దే ఆగిన రూ.71 కోట్లు 
కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.196 కోట్లు విడుదల చేసింది. వాటిలో రూ.125 కోట్ల నిధులు మాత్రమే స్మార్ట్‌సిటీ ఖాతాకు జమ అయ్యాయి. మరో 71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. రూ.266.66 కోట్ల అంచనాలతో ప్రస్తుతం 9 పనులు కొనసాగుతున్నాయి. రూ.84 కోట్లతో ప్యాకేజీ–1 కింద ప్రధాన రహదారుల నిర్మాణం, రూ.80 కోట్లతో ప్యాకేజీ–2 కింద రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రెండో విడతగా రూ.131.40 కోట్లతో 7 పనులకు డీపీఆర్‌లు సిద్ధం చేశారు. వీటిలో 24 గంటల నీటి సరఫరా, నగర ముఖద్వారాల నిర్మాణం, ఈ– ఎడ్యుకేషన్, మరుగుదొడ్ల నిర్మాణం, హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ లాంటివి ఉన్నాయి.  

కరీంనగర్‌ ప్రాజెక్టు స్వరూపం..
►కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ పనుల ప్రారంభం: 2017 మార్చి 31న  
►స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల అంచనా మొత్తం: రూ.1,878 కోట్లు 
►రెట్రోఫిట్టింగ్‌ (అదనపు హంగులు)  పనులకు రూ.267 కోట్లు,  
►వినోదాత్మక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.76 కోట్లు  
►ప్రజారవాణా సదుపాయాల అభివృద్ధికి రూ.337 కోట్లు  
►మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.540 కోట్లు  
►విద్యుత్‌ సరఫరా వ్యవస్థ అభివృద్ధికి రూ.83 కోట్లు  
►ఇతర అవసరాలకు రూ.110 కోట్లు  
►ఇంటలిజెంట్‌ రవాణాకు రూ.226 కోట్లు  
►24/7 నీటి సరఫరాకు రూ.140 కోట్లు  
►స్మార్ట్‌ విద్యావిధానానికి రూ. 15 కోట్లు 
►స్మార్ట్‌ గవర్నెన్స్‌కు రూ.36 కోట్లు  
►ఇతర అవసరాలకు రూ.22 కోట్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement