సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు సంబంధించి రాష్ట్రానికి గతేడాది కంటే మెరుగ్గా నిధులు అందబోతున్నాయి. రైల్వే ప్రాజెక్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని తెలంగాణ ప్రాంతానికి ఈసారి రూ.3,048 కోట్లు ప్రతిపాదించారు. ఇది గతేడాది కేటాయింపులకన్నా 26 శాతం ఎక్కువ కావటం విశేషం. గత బడ్జెట్‌లో జోన్ మొత్తానికి కలిపి రూ.7,222 కోట్లు, ఇందులో రాష్ట్రానికి రూ.2,420 కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో రైల్వేకు నిధుల కేటాయింపు వివరాలను వెల్లడించే పింక్‌బుక్‌ను పార్లమెంటులో బుధవారం పొద్దుపోయిన తర్వాత ప్రవేశపెట్టారు.
ఆ వివరాలను రైల్వే శాఖ రాత్రి వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల వివరాల సమగ్ర సమాచారం గురువారం అధికారికంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించనున్నారు. పనులు జరుగుతున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం కొన్నేళ్లుగా కొత్త రైళ్లను మోదీ సర్కారు పెద్దగా ప్రకటించకున్నా ప్రాజెక్టులకు కొంత సంతృప్తికరంగానే నిధులు కేటాయిస్తోంది. ఈసారీ అదే పంథాను కొనసాగించినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తే తర్వాత ఇచ్చే నిధులు వేటికీ న్యాయం చేయలేమని ప్రధాని చెప్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పనులు జరుగుతున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చింది. వీటితో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రాజెక్టులు పూర్తి కానుండగా మరికొన్ని వేగంగా పనులు జరుపుకొనేందుకు వీలుపడనుంది. బుధవారం రాత్రి వరకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ప్రధాన ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.
మునీరాబాద్–మహబూబ్‌నగర్: రూ.210 కోట్లు
ఇది 1997–98లో మంజూరైంది. నిడివి 243 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,723 కోట్లు. ఇందులో తెలంగాణ పరిధిలో 66 కిలోమీటర్లు ఉంది. దీనికయ్యే వ్యయం రూ.452 కోట్లు. గత బడ్జెట్‌లో రూ.149 కోట్లు కేటాయించారు. దేవరకద్ర–మక్తల్ మధ్య లైన్ అందుబాటులోకి రాగా కృష్ణా–మక్తల్ మధ్య చివరి దశలో ఉన్నాయి.
భద్రాచలం–సత్తుపల్లి: రూ.162 కోట్లు
ఈ ప్రాజెక్టు 2010–11లో మంజూరైంది. నిడివి 54 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.704 కోట్లు, సింగరేణితో కలిసి బొగ్గు రవాణాకు ప్రత్యేకంగా రైల్వే ఈ పనులు చేస్తోంది. భద్రాచలం–చుండ్రుగొండ మధ్య 25 కిలోమీటర్లు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. గత బడ్జెట్‌లో రూ.267 కోట్లు కేటాయించారు. వాటితో పనులు వేగంగా సాగుతున్నాయి. తుది దశకు చేరుకున్నాయి.
కాజీపేట–బల్లార్షా మూడోలైన్: రూ.548 కోట్లు
ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. నిడివి 202 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. పోత్కపల్లి–కొలనూర్ మధ్య, వీరూరు–మానిక్‌ఘర్ సెక్షన్ల మధ్య పనులు పూర్తయ్యాయి. గత బడ్జెట్‌లో రూ.475 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికి 50 కిలోమీటర్ల పనులు పూర్తికాగా మిగతా సెక్షన్లలో పనులు పనులు వేగంగా సాగుతున్నాయి.
అక్కన్నపేట–మెదక్: రూ.41 కోట్లు
2012–13లో మంజూరైన ఈ ప్రాజెక్టు నిడివి 17 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.118 కోట్లు. ఇందులో సగం ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించాలి. గత బడ్జెట్‌లో రైల్వే రూ.83.6 కోట్లు కేంద్రం కేటాయించింది. ప్రస్తుతం పనులు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రం వాటా నిధులు పెండింగ్‌లో ఉండటంతో వాటి కోసం రైల్వే అడుగుతోంది. ఈసారి పెద్దగా నిధులు కేటాయించే అవకాశం లేదు.
మనోహరాబాద్–కొత్తపల్లి: రూ.160 కోట్లు
ఈ ప్రాజెక్టు 2006–07లో మంజూరైంది. నిడివి 151 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.1,160 కోట్లు. మూడొంతుల ఖర్చు రైల్వే భరించనుండగా ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. భూ సేకరణ వ్యయం తెలంగాణదే. ఇప్పటికే 50 కిలోమీటర్ల లైన్ పనులు పూర్తయ్యాయి. ఇందులో మనోహరాబాద్–గజ్వేల్ వరకు 32 కిలోమీటర్ల మేర పనులకు గతంలోనే రైల్వే సేఫ్టీ కమిషనర్ క్లియరెన్స్ వచ్చింది. మిగతా పనులు వేగంగా సాగుతున్నాయి. గత బడ్జెట్‌లో దీనికి రైల్వే రూ.325 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం కుకునూరు పల్లి వద్ద ట్రాక్ పరిచే పనులు జరుగుతున్నాయి.
చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్: రూ.69 కోట్లు
ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.110 కోట్లకు సంబంధించిన టెండర్లు పిలిచి పనులు అప్పగించటంతో 6 ప్లాట్ ఫామ్స్, 5 పిట్ లైన్స్ పనులు జరుగుతున్నాయి. గత బడ్జెట్‌లో కూ.50 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
రాష్ట్ర వాటా ఇస్తేనే ఎంఎంటీఎస్–2 దశ
ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే–రాష్ట్ర ప్రభుత్వం మధ్య పేచీ నెలకొంది. ఇది నగరంలో కీలకమైంది. ఎంఎంటీఎస్ మొదటి దశ విజయవంతం కావటంతో 2012–13లో ఈ ప్రాజెక్టు మంజూరైంది. అంచనా వ్యయం రూ.817 కోట్లు. మూడో వంతు రూ.450 కోట్లకు గాను రాష్ట్రప్రభుత్వం దశలవారీగా> రూ.130 కోట్లనే విడుదల చేసింది. తాము ఖర్చు చేయాల్సిన దానికన్నా ఎక్కువగా రైల్వే ఇప్పటికే వ్యయం చేసినందున రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇస్తేనే పనులు ముందుకు సాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత బడ్జెట్‌లో రూ.10 కోట్లే కేటాయించింది. ఘట్కేసర్–యాదాద్రి ఎంఎంటీఎస్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. రాష్ట్రం నిధులివ్వక పనులు సాగట్లేదు. రాష్ట్రం బకాయి పడటంతో తాజా బడ్జెట్‌లో కేంద్రం నిధులివ్వలేదని సమాచారం.
కాజీపేట ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ సంగతేంటి?
కీలకమైన కాజీపేట పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి రైల్వేకు అధికారికంగా భూ బదలాయింపు జరగలేదు. అది జరిగితేగాని పనులు చేపట్టలేనని రైల్వే ఇప్పటికే చెప్పింది. భూ బదలాయింపులో రాష్ట్రం చొరవ చూపితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు జరిగే అవకాశముంది. గత బడ్జెట్‌లో నామమాత్రంగా రూ. 2 కోట్లే దీనికి మంజూరయ్యాయి. ఈసారీ ప్రతిష్టంభన నెలకొంది.
కాజీపేట–విజయవాడ
మూడోలైన్: రూ.590 కోట్లు
ఈ ప్రాజెక్టు(2012–13) నిడివి 219 కి.మీ. అంచనా వ్యయం రూ.1,857 కోట్లు. విజయవాడ–కొండపల్లి మధ్య పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగతాచోట్ల జరుగుతున్నాయి. గత బడ్జెట్‌లో రూ.333 కోట్లు మంజూరయ్యాయి.
సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్: రూ.150 కోట్లు
ఈ ప్రాజెక్టు 2015–16లో మంజూరైంది. నిడివి 85 కిమీ. అంచనా వ్యయం రూ.774 కోట్లు. షాద్‌నగర్–గొల్లపల్లి మధ్య పూర్తి కాగా, గొల్లపల్లి–మహబూబ్‌నగర్ మధ్య త్వరలో పూర్తి కానున్నాయి. గత బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment