మళ్లీ 'షా'రొస్తున్నారు..అప్పటిదాకా ఇక్కడే మకాం..! | Central Minister Amith Shah Visit Telangana Again | Sakshi
Sakshi News home page

Amith Shah: తెలంగాణకు అమిత్‌ షా.. అసెంబ్లీ పోరు ముగిసేదాకా ఇక్కడే నివాసం? 

Published Sat, Mar 4 2023 4:16 AM | Last Updated on Sat, Mar 4 2023 8:29 AM

Central Minister Amith Shah Visit Telangana Again - Sakshi

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడం లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా నేరుగా కదన రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పన నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం దాకా పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసేదాకా అమిత్‌షా హైదరాబాద్‌లోనే మకాం వేసి పార్టీ శ్రేణులను ఉరుకులు, పరుగులు పెట్టించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లేమి, ఆధిపత్య పోరు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టనున్నారని వివరించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన  తెలంగాణపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించనున్నారని పేర్కొన్నాయి. 

ఇప్పటికే కర్ణాటకలో షురూ.. 
కర్ణాటకలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. అయితే కొంతకాలం నుంచి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందన్న అభిప్రాయం ఉంది. దీనికితోడు రాహుల్‌ గాంధీ భారత్‌జోడో యాత్రతో కాంగ్రెస్‌ పార్టీ కాస్త పుంజుకుందన్న అంచనాలూ వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ. ఆ రాష్ట్రంలో పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను అమిత్‌షాకే అప్పగించింది. గత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కకపోవడానికి నేతల మధ్య కుమ్ములాటలు, సమన్వయం లేకపోవడమే ముఖ్య కారణమని గుర్తించిన నాయకత్వం.. ఈసారి ఆ సమస్య పునరావృతం కాకుండా అమిత్‌షా నేతృత్వంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ రాష్ట్రంలో యావత్‌ ఎన్నికల వ్యూహ రచన ఆయన కనుసన్నల్లోనే సాగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని, పూర్తి సమయం కేటాయించేందుకూ అమిత్‌షా సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో ఎన్నికలు ముగిశాక.. అదే తరహాలో తెలంగాణపైనా దృష్టి పెట్టనున్నారు. 

సమన్వయ లేమి సమస్యతో.. 
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల వాతావరణం ఉందని.. కానీ రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లేమి సమస్యగా మారిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనిని పార్టీ అగ్ర నాయకత్వం గుర్తించిందని అంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరగడం, అందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాధించిన ఫలితాలు, సుపరిపాలన దోహదపడ్డాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు, అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర, మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రుల పర్యటనలతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు. కాషాయ జెండా ఎగిరేందుకు ఇంత అనుకూలంగా ఉన్న పరిస్థితిని.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దనే అభిప్రాయంతో అధినాయకత్వం ఉందని వివరిస్తున్నారు.  

ఇప్పటికే పరోక్షంగా పర్యవేక్షణ 
అమిత్‌షా ఇప్పటికే పరోక్షంగా రాష్ట్ర పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీరు, సీఎం కేసీఆర్‌ వ్యవహారశైలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నారు. పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఆయన అదుపాజ్ఞలు, పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అమిత్‌షా, ఇతర అగ్రనేతలు కలసి.. గతంలో లోక్‌సభ, యూపీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషిచేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ను రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా నియమించారు.

ప్రస్తుతం బన్సల్‌ నేతృత్వంలోనే ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’ స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లు, పోలింగ్‌ బూత్‌ స్థాయిలో పార్టీ సంస్థాగత పటిష్టత, బూత్‌ సశక్తికరణ్‌ అభియాన్‌ వంటివి చేపడుతున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదు విడతల్లో చేపట్టిన పాదయాత్రతో దాదాపు సగం అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్‌ అయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పాదయాత్రలు కాకుండా.. రాష్ట్రంలోని నాలుగైదు రూట్లలో ముఖ్యనేతలంతా సమాంతరంగా పాల్గొనేలా రథయాత్రలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్టు పార్టీ నేతల సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే జాతీయ నాయకత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement