సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడంపై టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. ప్లాస్మా దాతలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చేందుకు డొనేట్‌ప్లాస్మా.ఎస్‌సీఎస్‌సీ.ఇన్ ఆన్‌లైన్ లింక్ ప్రారంభించడంపై ప్రశంసలు కురిపించారు. కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్ పోలీసుల సామాజిక దృక్పథ కోణంపై అభినందనలు తెలిపారు.
అదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని మెగాస్టార్ చిరంజీవి సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌కు స్పందించారు. అలాగే ప్లాస్మా దాతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు సైబరాబాద్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం మహా అద్భుతమంటూ హీరో సాయికుమార్ ట్వీట్ చేశారు. అలాగే హీరో మహేశ్‌బాబు ట్వీట్ చేస్తూ... సైబరాబాద్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీలు ప్లాస్మా దాతలను సత్కరించడం ఇతరుల్లో స్ఫూర్తి కలిగించేలా ఉందని, కరోనాను జయించిన ప్రతి ఒక్కరూ ప్లాస్మా వారియర్‌గా వ్యవహరించాలని కోరారు. మరో హీరో రఘు కుంచె ఇదో మంచి కార్యక్రమని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment