కోవిడ్ 19 (కరోనా వైరస్)ను కట్టడి చేసే క్రమంలో 21 రోజులు దేశం లాక్ డౌన్‌లో ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రజలందరూ ఇందుకు సహకరించాలని కొందరు సినీ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ వివరాలు ఇలా..
► ఇంట్లో వాడే నిత్యావసర సరుకులను వీలైనంత తక్కువగా వాడుకుంటూ పొదుపు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నీ అయిపోయాయి, కొనాలంటే వస్తువులు దొరకడం లేదనే కంగారు, ఆందోళనలు ఉండవు.
► అవసరం మేరకు మాత్రమే కొని భద్రపరచుకుందాం. కనీస పొదుపు ఆచరించి ఇతరుల అవసరాలకు కూడా సహకరిద్దాం.
► వేపుడు వంటకాలు, కాలక్షేప, తీపి తినుబండారాలకు దూరంగా ఉందాం. ఖాళీ సమయం దొరికింది కదా అని కొత్త వంటలు, ప్రయోగాలను ఇప్పటి పరిస్థితుల్లో మానుకుందాం.
► మన చిన్నతనంలో బామ్మలు, అమ్మమ్మలు, అమ్మ మనకు చేసిపెట్టిన తరహాలో కనీస కూరలతో భోజనం కానిద్దాం.
► భారతీయులుగా మనమంతా ఒక్కటై కరోనా వైరస్ వ్యాప్తిని నివారిద్దాం.
► దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీగారికి, అందుకు సహకరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా అభినందనలు, ధన్యవాదాలు.
► ఈ లాక్‌డౌన్ సమయంలో ఇంటిపట్టునే ఉండి ఆరోగ్యంగా ఉందాం... ఆరోగ్యం పంచుదాం.
– చిరంజీవి
మన ప్రధాని మోదీగారు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. కరోనా కట్టడికి ఇది మంచి అడుగు. మన జీవితాల కన్నా ఏదీ ముఖ్యం కాదు. నేను, నా కుటుంబం ఇంట్లోనే ఉంటున్నాం. మీరు కూడా ఇదే పాటించాలని కోరుకుంటున్నాను.
– తమన్నా
ధనిక, పేద, కులం, మతం అనే తారతమ్యాలు లేవు. మనం దరం మనుషులం. సమిష్టిగా పోరాడి కరోనాను చంపేద్దాం.
– మంచు మనోజ్
ఇప్పటి మన జీవనశైలిలో 21రోజులు ఇంటిపట్టునే ఉండటం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇలా మనందరం లాక్‌డౌన్‌లో ఉన్నందుకు సంతోషపడే సమయం వస్తుందని నమ్ముతున్నాను.
– తాప్సీ
స్వీయ నియంత్రణకు, పాత అలవాట్లను మానుకుని కొత్త అలవాట్లు అలవరచుకోవడానికి 21 రోజులు సమయం చాలా ఉత్తమమైనది. ఆన్‌లైన్ కోర్సులు, ఎక్కువగా చదువుకోవడం ముఖ్యంగా మెడిటేషన్ వంటివి చేస్తున్నాను నేను. సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి.
– కాజల్ అగర్వాల్
ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు. మనకు నచ్చిన రీతిలో ఉగాది వేడుక జరుపుకోలేకపోయాం. కరోనా మహమ్మారి మరణం తర్వాత తొందర్లోనే ఓ కొత్త ఆరంభం లభిస్తుంది. ఇంట్లో ఉండండి. సురక్షితంగా ఉండండి.
– అదితీరావ్ హైదరీ
మానసికంగా ధృడంగా ఉండండి. పుస్తకాలు చదవడం, వంటలు చేయడం, యోగా చేయడం వంటివి చేయండి. అప్పుడప్పుడు ప్రార్థనలు చేయండి. 21 రోజులు ఇట్లే గడిచిపోతాయి.
– అనుపమా పరమేశ్వరన్
‘కంట్రీ 21డేస్ లాక్‌డౌన్’కు కట్టుబడి ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని మరికొందరు స్టార్స్ స్పందించారు.
ఈ 21 రోజుల లాక్‌డౌన్‌ని పాటించకపోతే ఈ లాక్‌డౌన్ ఇంకా మరో నెల కొనసాగే అవకాశం ఉంది. ఇటలీ, స్పెయిన్, ఇరాన్ వంటి దేశాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో మనం చూస్తున్నాం. అక్కడి పరిస్థితులను చూసి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో మనం వ్యవహరిస్తే మనతో పాటు మనకు ఇష్టమైనవారిని, దేశంలోని ప్రజలను మనం విపత్కర పరిస్థితుల్లోకి నెట్టినవాళ్లం అవుతాం. కరోనాను కట్టడి చేయడంలో ఉన్న మీ వంతు బాధ్యతను ఓసారి గుర్తు చేసుకోండి. మనందరం కలిసి పోరాడితే ఈ కరోనా పరిస్థితులను విజయవంతంగా దాటగలం.
– ఇలియానా
కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా తమ వంతు బాధ్యతగా కరోనా మహమ్మారిని తరిమేద్దాం అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి, కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మహేశ్‌బాబు. ‘నమ్మకమైన సమాచారాన్ని కలిగి ఉండండి. ప్రార్థిద్దాం, మంచిని ఆశిద్దాం.. కలసికట్టుగా ఈ యుద్ధాన్ని గెలుద్దాం’ అంటూ, కింది విలువైన నియమాలను పాటించాలని కోరారు మహేశ్‌బాబు.
1 ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.
2 ఏదైనా వస్తువును తాకితే కనీసం 20 నుంచి 30 సెకన్లు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవాలి.
3 ముఖాన్ని.. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకుండా ఉండండి.
4 దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు లేదా టిష్యూ వాడండి.
5 సామాజిక దూరం అవసరాన్ని అర్థం చేసుకుని, మీ ఇంటి లోపల లేదా బయట ఇతర వ్యక్తుల నుండి కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి.
6 మీకు కరోనా లక్షణాలు లేదా అనా రోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్క్‌ని వాడండి. మీకు కోవిడ్–19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్ని లేదా క్లినిక్‌ని సంప్రదించండి.
Comments
Please login to add a commentAdd a comment