యూనివర్సల్‌ 2020 టైటిల్‌కు దివిజ | Classical Dancer Divija Selected Universal 2020 | Sakshi
Sakshi News home page

శాస్త్రీయ కళల్లో రాణిస్తూ..

Published Fri, Aug 14 2020 8:18 AM | Last Updated on Fri, Aug 14 2020 8:18 AM

Classical Dancer Divija Selected Universal 2020 - Sakshi

నృత్య ప్రదర్శనలిస్తున్న దివిజ 

ఆదిలాబాద్‌టౌన్‌: ఆమె ఓ నాట్యమయూరి.. తన ప్రదర్శనలతో అందర్ని ఇట్టే ఆకట్టుకుంటోంది.. తాను నృత్యం చేస్తే కనురెప్పలు తిప్పకుండా చూస్తుండిపోవాల్సిందే. లలిత కళలతో పాటు చదువుల్లో కూడా ముందంజలో ఉంది. కర్ణాటక సంగీతం, కూచిపుడి నృత్యం, వీణా, క్యాషియో, గిటార్‌ వాయించడంలో ఆమె మేటి అని చెప్పడం అతిశయోక్తి కాదు. చిన్ననాటి నుంచే కళల వైపు మొగ్గు చూపుతుండడంతో తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహం అందిస్తున్నారు. తండ్రి మహేష్‌ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుండగా, తల్లి కవిత డ్యాన్స్‌ మాస్టర్‌గా ఉన్నారు. దీంతో తల్లి చిన్ననాటి నుంచే ఆమెకు కళలను నేర్పించడంతో గురువును మించిన శిశురాలిగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు  అందుకుంది. దీంతో పలు అవార్డులతో పాటు గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించింది.

యూనివర్సల్‌ మల్టీ ట్యాలెంట్‌కు ఎంపిక..
ఆదిలాబాద్‌ పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన దివిజ యూనివర్సల్‌  2020 మల్టీ ట్యాలెంట్‌కు ఎంపికైంది. తానా, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు ఆమెను అభినందించారు. గత నెల 24, 25 తేదీల్లో ఆన్‌లైన్‌లో తానా, తెలుగు సాంస్కృతిక కార్యక్రమం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా, కువైట్, న్యూజిలాండ్, యూఎస్‌ఏతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. సౌందర్య లహరి నైపుణ్యాలు, కూచిపూడి, వీణా, గిటార్, క్యాషియో, తదితర రంగాలకు సంబంధించి 700మంది కళాకారులు పాల్గొన్నారు. అయితే మొదటి దశలో 25మందిని ఎంపిక చేశారు. వీరి ప్రదర్శనలు ఈ–మెయిల్‌ ద్వారా పంపారు. రెండో దశలో 25నుంచి 11మందిని ఎంపిక చేశారు. ఆ 11మందిలో దివిజ స్థానం సాధించింది. ప్రస్తుతం ఈమె డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 

పలు రంగాల్లో ప్రావీణ్యం..
2014లో హైదరాబాద్‌లోని గచ్చిబౌళిలో నిర్వహించిన సిలికాన్‌ ఆంధ్ర కూచిపుడి నృత్య సమ్మేళనంలో ప్రతిభ కనబర్చింది. వరల్డ్‌ గిన్నిస్‌బుక్‌లో రికార్డుకెక్కింది.
2016లో విజయవాడలో నిర్వహించిన సిలికాన్‌ ఆంధ్ర కూచిపుడి నృత్య సమ్మేళనంలో ప్రతిభ కనబర్చి మరోసారి గిన్నిస్‌బుక్‌లో రికార్డు సాధించింది.
2016లో గోదావరి పుష్కరాల్లో భాగంగా సరస్వతి దేవి పుణ్య క్షేత్రంలో స్వర సంగీత, శాస్త్రీయ నృత్య, కూచిపుడి నృత్య సమ్మేళన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గోదావరి పుష్కర అవార్డును అందుకుంది.
2016లో జైనథ్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీల్లో ప్రతిభ కనబర్చి ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ చేతుల మీదుగా అవార్డు అందుకుంది.
 2017లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీల్లో నాట్య కిరణం అవార్డును తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య చేతుల మీదుగా అందుకుంది.
 2017లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించి ఏబీసీ ఫౌండేషన్, భారత్‌ ఆర్ట్స్‌ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కల్చరల్‌ ఫెస్టివల్‌లో తెలుగు వరల్డ్‌ రికార్డుకెక్కింది. ఆ అవార్డును లక్ష్మీపార్వతి చేతుల మీదుగా అందుకుంది. ఇలా చెప్పుకుంటుపోతే అనేక అవార్డులు ఆమె సొంతం..

చిన్ననాటి నుంచే  ఇష్టంగా ముందుకు
అమ్మ డ్యాన్స్‌ మాస్టర్‌ కావడంతో చిన్నప్పటి నుంచే నాకు లలిత కళలు అంటే ఇష్టం. నా ఇష్టాన్ని తెలుసుకొని అమ్మనాన్న ప్రోత్సాహం అందించడంతోనే ముందుకు సాగుతున్నాను. కరోనా నేపథ్యంలో తానా, తెలంగాణ సాంస్కృతి కార్యక్రమాలు ఆన్‌లైన్‌లో జరిగాయి. ఇందులో మల్టీ ట్యాలెంట్‌ టెస్ట్‌కు ఎంపికయ్యాను. ఆ సంస్థ వారు నన్ను అభినందించడం జరిగింది.– దివిజ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement