సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
బీమా నగదు వారం రోజుల్లో నేరుగా వారి ఖాతాలో జమచేయనున్నట్లు పేర్కొన్నారు.ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని, రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంగళవారం దీనికి సంబంధించి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కల్లుగీత సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.
ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నప్పటికీ.. ఇది బాధితులకు అందడంలో ఆలస్యమౌతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత
రేపే నీరా కేఫ్ ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం నెక్లెస్ రోడ్డులో అధునాతన హంగులతో నిర్మించిన నీరాకేఫ్‌ను మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బుధవారం ప్రారంభించనున్నారు. గౌడ కులస్థులకు ఉపాధి కల్పించడంతోపాటు తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన, ప్రకృతిసిద్ధమైన నీరాను అందించాలని నిర్ణయించింది. రూ.12.20 కోట్లతో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో నీరా కేఫ్‌ను సుందరంగా నిర్మించింది. ఇదే స్ఫూర్తితో భువనగిరిలోని నందనం, రంగారెడ్డిలోని ముద్విన్, సంగారెడ్డిలోని మునిపల్లి, నల్లగొండలోని సర్వేల్‌లో నాలుగు నీరా సేకరించే కేంద్రాల కోసం ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 319 మంది గీత కార్మికులను గుర్తించి, వారికి శిక్షణ ఇప్పించింది.
Comments
Please login to add a commentAdd a comment