
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సవాల్‌గా తీసుకుంటున్నారనడానికి స్వయంగా ఆయన ఓ గ్రామానికి ఇన్‌చార్జిగా వ్యవహరించడమే ఓ ఉదాహరణ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఇతర ప్రజాప్రతినిధులను మండలాలు, గ్రామాల ఇన్‌చార్జీలుగా నియమించిన కేసీఆర్ తాను కూడా ఓ గ్రామానికి బాధ్యుడిగా వ్యవహరించను న్నారు.
సీఎం ఆ గ్రామంలో మకాం వేయకుండానే పర్యవేక్షించే అవకాశముంది. మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో కేసీఆర్ ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. కేసీఆర్ మార్గనిర్దేశనంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి బృందం అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వ హించనుంది. మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లామంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. దసరా మరునాడు నుంచి మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి పార్టీ ఇన్‌చార్జీ లు తమ బృందాలతో తరలివస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. నియోజకవర్గ ప్రచారానికి వచ్చే పార్టీ బృందాలకు అవసరమైన వసతి, సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ నేతలను ఆదేశించారు.
ప్రచార బృందాలతో సమన్వయం చేసుకుంటూ అన్నివర్గాల ఓటర్లను కలిసేలా ప్రణాళిక రూ పొందించుకోవాలని సూచించారు. నియోజకవర్గా న్ని 86 యూనిట్లుగా విభజించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
కేటీఆర్‌కు గట్టుప్పల్ బాధ్యతలు
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ మండల కేంద్రం యూనిట్‌కు, మంత్రి హరీశ్‌రావు మర్రిగూడ మండల కేంద్రం యూనిట్‌కు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారు.
15న మునుగో డు ఉపఎన్నిక నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా, కొత్తగా ఏర్పాటయ్యే బీఆర్‌ఎస్‌కు ఆలోగా కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరణ లభిస్తే టీఆర్‌ఎస్ అభ్యర్థి బీఆర్‌ఎస్ తరఫున పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం జరిగే రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశంలో మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.