Munugode By-Elections 2022: TRS CM KCR Preparations Huge Public Meeting At Chandur - Sakshi
Sakshi News home page

Munugode Bypoll 2022: లక్ష మందితో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ!

Published Wed, Oct 26 2022 2:23 AM | Last Updated on Wed, Oct 26 2022 10:30 AM

TRS CM KCR preparations huge public meeting at Chandur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరో వారం రోజుల్లో ముగియనుండటంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తన ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతోంది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు మునుగోడులో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళిక అమలు చేస్తోంది.

పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, హరీశ్‌రావుతో పాటు పలువురు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు, మరోవైపు క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. వచ్చే నెల 1న ప్రచార పర్వం ముగియనుండగా, రెండురోజుల ముందు అంటే ఈ నెల 30న చండూరులో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సభలో పాల్గొననున్నారు. మరోవైపు యూనిట్‌ ఇన్‌చారి్జలుగా వ్యవహరిస్తున్న నేతలంతా చివరి నిమిషం వరకు తమకు కేటాయించిన ప్రాంతంలోనే మకాం వేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. వారి పనితీరుపై ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేటు సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు కేసీఆర్, కేటీఆర్‌కు నివేదికలు అందజేస్తున్నాయి.

ఈ నివేదికల ఆధారంగా అవసరమైన చోట ఇతర ప్రాంతాలకు చెందిన కీలక నేతలను మోహరించి ప్రచార లోపం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ప్రచార సరళి, అభ్యర్థుల ప్రచారానికి వస్తున్న స్పందన, ఆయా పార్టీలు అనుసరిస్తున్న తెర వెనుక వ్యూహాలు గమనిస్తూ తక్షణమే ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీనిని స్వయంగా కేటీఆర్‌ పర్యవేక్షిస్తున్నారు. 

నగర ఓటర్లపై దృష్టి
నియోజకవర్గానికి చెందిన సుమారు 40 వేల మందికి పైగా ఓటర్లు హైదరాబాద్‌ శివారు కాలనీల్లో ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 300 నుంచి 500 వరకు ఓటర్లు నగరంలో నివాసముంటున్నట్లు తమ పరిశీలనలో తేలిందని యూనిట్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆయా కాలనీల్లోని మునుగోడు ఓటర్ల వివరాలు.. ఇంటి చిరునామా, ఫోన్‌ నంబరుతో సహా ఇప్పటికే సేకరించి పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాలను టీఆర్‌ఎస్‌ పూర్తి చేసింది. పోలింగ్‌ రోజున వారంతా మునుగోడులో ఓటు హక్కు వినియోగించుకునలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రతి ఓటును కీలకంగా భావిస్తున్న టీఆర్‌ఎస్‌.. పోస్టల్‌ బ్యాలెట్లపైనా దృష్టి సారించి, వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. 

నిరంతరం టచ్‌లో ఉండేలా..
ఓటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ప్రతి ఓటరును కనీసం అరడజను సార్లు కలిసే వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌ అమలు చేస్తోంది. యూనిట్‌ ఇన్‌చారి్జలుగా వ్యవహరిస్తున్న నేతలు.. తమ పరిధిలోని ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ నేత చొప్పున బాధ్యతలు అప్పగించారు. పోలింగ్‌ రోజున ఓటు వేసి వెళ్లేంతవరకు వారితో టచ్‌లో ఉండేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, సామాజికవర్గాల సమ్మేళనం పేరిట ప్రతి కుటుంబాన్ని చేరుకునేలా టీఆర్‌ఎస్‌ ప్రచారం సాగుతోంది.

సభ విజయవంతమయ్యేలా..
చండూరు సభకు సుమారు లక్ష మంది హాజరయ్యేలా చూడాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జన సమీకరణపై దృష్టి సారించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్‌ ఇప్పటికే చౌటుప్పల్, గట్టుప్పల్, మునుగోడు మండల కేంద్రాల్లో రోడ్‌ షోలు నిర్వహించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement