నేడు అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్‌  | Telangana CM KCR Will Be Unveiling 125-Ft Tall Ambedkar Statue On April 14th - Sakshi
Sakshi News home page

దార్శనికుడి విశ్వరూపం.. 125 అడుగుల అంబేడ్కర్‌ భారీ విగ్రహాం

Published Fri, Apr 14 2023 3:06 AM | Last Updated on Fri, Apr 14 2023 11:46 AM

CM KCR will unveil a 125 feet statue of BR Ambedkar 14th April 2023 - Sakshi

గురువారం రాత్రి విద్యుత్‌ వెలుగుల్లో అంబేడ్కర్‌ విగ్రహం

‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు..జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’.. 
– అంబేడ్కర్‌

రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ సమాజం అర్పిస్తున్న ఘన నివాళి ఇది
– సీఎం కేసీఆర్‌

‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’.. అవును.. అలా చెప్పడమేకాదు.. జనం కోసమే జీవించి జనంలో నిలిచిపోయిన మహా మనిషి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌. ‘నేను, నా దేశం అని చెప్పాల్సి వస్తే.. నా దేశమే నాకు అత్యంత ముఖ్యమైన’దని చాటిన ఆయనను దేశమంతా స్మరించుకునే రోజు ఏప్రిల్‌ 14. ఆ మహనీయుడి జయంతి. ఈ రోజునే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాల్లో కెల్లా ఇదే అతిపెద్దది కావడం విశేషం. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో హుస్సేన్‌ సాగర్‌ తీరాన సగర్వంగా కొలువైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం సీఎం కేసీఆర్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం భారీ విగ్రహంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించనున్నారు. తర్వాత బౌద్ధ గురువుల ప్రార్థనలను నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు.

దాదాపు 50వేల మంది దీనికి హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. విగ్రహావిష్కరణ, సభ, ఇతర కార్యక్రమాల కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సభకు హాజరైనవారికి మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, స్వీటు ప్యాకె ట్లను పంపిణీ చేయనున్నారు. విగ్రహావిష్కరణ, సభ కార్యక్రమాల్లో ప్రత్యేక అతిథిగా అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అంబేడ్కర్‌వాదులు, అభిమానులు పాల్గొననున్నారు. 

రూ.146.50 కోట్ల ఖర్చుతో.. 
అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్‌ 14న సీఎం కేసీఆర్‌ భారీ అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విగ్రహం, ఇతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.146.50 కోట్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్‌ గార్డెన్‌ సమీపంలో 11.7 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విగ్రహ నిర్మాణం, డిజైన్, పనులు తదితర అంశాలపై అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ఆ కమిటీ పలు దేశాలు, రాష్ట్రాల్లోని భారీ విగ్రహాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దాని ప్రకారం ఏడేళ్ల పాటు శ్రమించిన శిల్పులు, ఇంజనీర్లు భారీ విగ్రహాన్ని ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మించారు. పీఠంపైకి ఎక్కి విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్లదారి, ర్యాంప్‌ ఉంటాయి. 

విగ్రహంలో గ్రంథాలయం, హాల్స్‌ 
విగ్రహం దిగువన పీఠంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో అంబేడ్కర్‌ రచనలు, ఆయన చరిత్రకు సంబంధించిన అంశాలు, కీలక సందర్భాలను తెలిపే పుస్తకాలు, చిత్రాలు ఉంటాయి. భవనంలోపల ఆడియో విజువల్‌ రూమ్‌ ఉంటుంది. అందులో అంబేడ్కర్‌ జీవన విశేషాలను ప్రదర్శిస్తారు.  

36 ఎకరాల్లో స్మృతివనం: అంబేడ్కర్‌ స్మృతివనం కోసం విగ్రహం పక్కనే 36 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అందులో రాక్‌ గార్డెన్, ల్యాండ్‌ స్కేపింగ్, ప్లాంటేషన్, వాటర్‌ ఫౌంటేన్స్, శాండ్‌స్టోన్‌ వర్క్‌ ఉంటాయి. దాదాపు 450 కార్లు పాకింగ్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. 

జీవం పోసిన వంజి సుతార్‌ 
హుస్సేన్‌సాగర్‌ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహానికి జీవం పోసిన శిల్పి రామ్‌ వంజి సుతార్‌. మహారాష్ట్రకు చెందిన ఆయన వయసు 98 ఏళ్లు. దేశంలోని అతిపెద్ద విగ్రహాలన్నీ సుతార్‌ రూపొందించినవే. పార్లమెంట్‌ భవనం వద్ద కూర్చున్న స్థితిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి.. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన కొలువైన ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ (సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌)’కు రూపమిచ్చి నదీ ఆయనే కావడం విశేషం. భారత ప్రభుత్వం సుతార్‌ను 1999లో పద్మశ్రీతో, 2016లో పద్మభూషణ్‌తో సత్కరించింది కూడా.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement