రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శ
విపత్కర సమయంలో ఏచూరి లేకపోవడం తీరనిలోటని వ్యాఖ్య
నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప నేత అన్న సీఎం
కండువాలు మార్చే కాలంలో సిద్ధాంతం కోసం నిలబడిన నేత ఏచూరి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలనే కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణ యించడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పోరాడాల్సిన అవసరం ఉత్పన్నమైందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సీపీఎం రాష్ట్ర శాఖ నిర్వహించిన సీతారాం ఏచూ రి సంస్మరణ సభలో సీఎం రేవంత్ పాల్గొని మా ట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరి అని.. ప్రజల సంక్షేమం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసిన ఆయన ప్రస్తుతం తరానికి ఎంతో ఆదర్శమని రేవంత్ పేర్కొన్నారు.
ఆధిపత్యం చలాయించే దిశగా..
‘‘దేశంలో ఇప్పుడు అత్యంత కీలక సమయం ఆసన్నమైంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జమిలి ఎన్నికల ద్వారా దేశంపై ఆధిపత్యం చలాయించాలనే దిశగా కుట్ర జరుగుతోంది. ఇలాంటి కీలక సమయంలో సీతారాం ఏచూరి మనమధ్య లేకపోవడం తీరని లోటు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించిన ఆయన ఉండి ఉంటే జమిలి ఎన్నికలపై తీవ్ర పోరాటం నడిపేవారు.
ఏచూరితో మాట్లాడినప్పుడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి గుర్తుకు వచ్చేవారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన అత్యంత తక్కువ మంది తెలుగు వాళ్లలో ఏచూరి, జైపాల్‌రెడ్డి కీలకమైనవారు..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. యూపీ ఏ పదేళ్ల పాలన సమయంలో సీతారాం ఏచూరి క్రియాశీలకంగా వ్యవహరించారని.. పేదలకు ఉపాధి కలి్పంచే ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యాహక్కు చట్టం వంటివి ఏచూరి మద్దతుతోనే ముందుకు సాగాయని చెప్పారు.
కనీస విలువలు లేని ఎన్డీయే ప్రభుత్వం
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కనీస విలువలు లేకుండా వ్యవహరిస్తోందని రేవంత్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న నేత పట్ల చవకబారు భాషలో మాట్లాడుతున్నా ప్రధాని మోదీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీపై కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి అభ్యంతరకరంగా మాట్లాడటం బీజేపీ ఫాసిస్టు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. సీతారాం ఏచూరిపై రాసిన పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు.
ఉద్యమ నేత ఏచూరి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి: కేటీఆర్
ప్రజా ఉద్యమాలను నడిపిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరి అని.. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో భిన్నాభిప్రాయంతో ఉన్నా, ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డగా తమతో రక్త సంబంధం ఉందన్నారు. సీతారాం ఏచూరి నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా, ప్రజా సమస్యలపైనే పోరాటం చేసిన గొప్ప నాయకుడని చెప్పారు. తి ట్లు, బూతులు చలామణీ అవుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరి ప్రసంగాలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.
అసలు సిసలైన హైదరాబాద్ బిడ్డ ఆయన అని.. ఓట్ల రాజకీయంలో వెనుకబడినా, ప్రజల కోసం పోరాటంలో ముందున్నామని చాటిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాం«దీని జేఎన్‌యూ వీసీ పదవి నుంచి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఏచూరి గుండె ధైర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ ఐఏ ఎస్ అధికారి మోహన్‌కందా, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యేలు మా గంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment