గౌరవ వందనం స్వీకరిస్తున్న జనరల్ మనోజ్‌పాండే
సాక్షి, హైదరాబాద్: భారత వైమానిక దళంలో చేరే అభ్యర్థులు నిరంతరం విజ్ఞాన సాధన కొనసాగించాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ మనోజ్ పాండే సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం ఏర్పరుచుకోవాలన్నారు. మన దేశ భద్రతా వ్యవస్థ చాలా విస్తృతమైందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్, హైపర్‌సోనిక్స్ వంటి సాంకేతికతలు ఇకపై సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కావని, యుద్ధ ప్రదేశాల్లోనూ భౌతికంగా అవసరం అవుతాయని పేర్కొన్నారు.
‘ఆత్మనిర్భరత’లో భాగంగా సాయుధ దళాల్లోనూ పలు సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రతీ యువ అధికారులు ఇతరులకు మార్గదర్శకులుగా నిలిచేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. మహిళలు సాయుధ దళాల్లోకి ప్రవేశించడం స్ఫూర్తిదాయకమని వివరించారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివా రం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) జరిగింది.
భారత వైమానిక దళంలోని ‘ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ’లకు చెందిన 165 మంది ఫ్లయిట్ కెడెట్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మనోజ్ పాండే ప్రెసిడెంట్ కమిషన్‌లను ప్రదానం చేశారు. భారత నావికాదళం, ఇండియన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన అధికారులకు కూడా వింగ్స్ అవార్డులను అందించారు. అనంతరం పిప్పింగ్ సెరిమనీ, కవాతు, తేజస్, సూర్యకిరణ్, సారంగ్ బృందంతో ఏరోబాటిక్ ప్రదర్శనలు జరిగాయి. పైలెట్ల కోర్సులో మొదటి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ రాఘవ్ అరోరా.. రాష్ట్రపతి çపతకం, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డులను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment