‘గగన’ విజయం | telangana: Success story of flight cadets.. | Sakshi
Sakshi News home page

‘గగన’ విజయం

Published Mon, Dec 18 2023 5:14 AM | Last Updated on Mon, Dec 18 2023 5:14 AM

telangana: Success story of flight cadets.. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కలలు కన్నారు.. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడ్డారు.. వ చ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ గగనతలంలో విజయబావుటా ఎగురవేశారు ఈ యువ ఫ్లయింగ్‌ కేడెట్లు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం అయినా..అంతిమ లక్ష్యం మాత్రం భరతమాత సేవలో తాము ఉండాలన్నదే. ఆదివారం దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌లో పాల్గొని భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా యువ అధికారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. 

దేశ సేవలో నేను మూడో తరం.. 
దేశ సేవలో మా కుటుంబ నుంచి మూడో తరం అధికారిగా నేను ఎయిర్‌ఫోర్స్‌లో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మా తాతగారు పోలీస్‌ అఫీసర్‌గా చేశారు. మా నాన్న కర్నల్‌ రాజేశ్‌ రాజస్థాన్‌లో పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఎయిర్‌ ఫోర్స్‌లో నావిగేషన్‌ బ్రాంచ్‌లో సెలక్ట్‌ అయ్యాను. వెపన్‌సిస్టం ఆపరేటర్‌గా నాకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది ఎంతో చాలెంజింగ్‌ జాబ్‌. శిక్షణ సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులను దాటిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి బాధ్యత అయినా నిర్వర్తించగలనన్న నమ్మకం పెరిగింది. మా స్వస్థలం జైపూర్‌. నేను బీటెక్‌ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ సిస్టం అమేథీలో చేశాను.  – ఫ్లయింగ్‌ కేడెట్‌ థాన్యాసింగ్, జైపూర్‌  

నాన్నే నాకు స్ఫూర్తి... 
మాది వికారాబాద్‌ జిల్లా చీమల్‌దరి గ్రామం. నాన్నపేరు శేఖర్‌. ప్రైవేటు ఉద్యోగి, అమ్మ బాలమణి టైలర్‌. చిన్నప్పటి నుంచి నాన్న స్ఫూర్తితోనే నేను డిఫెన్స్‌ వైపు రాగలిగాను. కార్గిల్‌ యుద్ధంలో సూర్యకిరణ్‌ పైలెట్‌ బృందం ఎంతో కీలకంగా పనిచేసిందన్న వార్తలను చూసి మా నాన్న నాకు సూర్యకిరణ్‌ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే నన్ను డిఫెన్స్‌కు వెళ్లేలా ప్రోత్స హించారు. అలా నేను ఏడో తరగతిలో డెహ్రాడూన్‌లోని రాష్ట్రాయ ఇండియన్‌ మిలిటరీ కాలేజ్‌కు ప్రవేశ పరీక్ష రాసి 8వ తరగతిలో చేరాను. అందులో రాష్ట్రానికి ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారు. అంత పోటీలోనూ నేను సీటు సాధించాను. అక్కడే ఇంటర్మీడియెట్‌ వరకు చదివాను. ఆ తర్వాత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో రెండేళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కి సెలక్ట్‌ అయ్యాను.  – సూర్యకిరణ్, చీమల్‌దరి, వికారాబాద్‌ జిల్లా 

భారత సైన్యంలో చేరడం నా కల.. 
నా పేరు లతా కౌషిక్‌. మాది హరియాణా రాష్ట్రంలోని జజ్జర్‌ జిల్లా దుబల్‌దాన్‌ గ్రామం. మానాన్న రైతు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా కాలేజీలో బీఎస్సీ హానర్స్, మ్యాథ్స్‌ చదివాను. డిఫెన్స్‌ ఫోర్స్‌లో చేరడం ద్వారా దేశానికి, ప్రజల రక్షణకు పనిచేయవచ్చని నా కోరిక. ఆడపిల్ల డిఫెన్స్‌లోకి ఎందుకు అని ఏనాడు మా ఇంట్లో వాళ్లు అనలేదు. మా నాన్నతో సహా కుటుంబం అంతా నన్ను ప్రోత్సహించడంతోనే నేను ఎయిర్‌ఫోర్స్‌కి వచ్చాను. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదు. అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి.  – లతా కౌషిక్, ఫ్లయింగ్‌ ఆఫీసర్, హరియాణా 

ఎప్పుడూ ఫ్లైట్‌ ఎక్కని నేను ఫైటర్‌ పైలట్‌ అయ్యాను.. 
నాపేరు జోసెఫ్‌. నేను ఒక్కసారి కూడా ఫ్లైట్‌ ఎక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఫైటర్‌ పైలెట్‌ కావడం సంతోషంగా ఉంది. మా సొంత ప్రాంతం గుంటూరు. నేను టెన్త్‌ వరకు గుంటూరులో చదివాను. ఎయిర్‌ఫోర్స్‌కి రావాలని అనుకోలేదు. ఇంటర్మిడియెట్‌ తర్వాత ఎన్‌డీఏ గురించి తెలుసుకుని ఈ కెరీర్‌ని ఎంచుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఫెయిల్‌ అయ్యాను. తర్వాత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీకి వెళ్లగలిగాను. అక్కడ నుంచి భారత వాయుసేనలో సెలక్ట్‌ అయ్యాను. మా తల్లిదండ్రు ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరాను. పేరెంట్స్‌ సపోర్ట్‌ లేకుండా పిల్లలు ఏదీ సాధించలేరు. తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తేనే పిల్లలు వారి కలలు నిజం చేసుకోగలుగుతారు. – జోసెఫ్, ఫైటర్‌ పైలట్, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement