సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్‌చార్జినని ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్‌బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు.
ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి బదులు సంబంధం లేని వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. తమ వార్ రూమ్‌లో పని చేస్తున్న ముగ్గురు యువకులను అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తాం: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కేసు విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరడాన్ని కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతామని, ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మల్లు రవి వెల్లడించారు.
శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్, బెల్లయ్య నాయక్, పున్నా కైలాశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైన ఘటనలు ఉన్నాయి కానీ ఒక పార్టీ శాసనసభాపక్షం మరో పార్టీలో విలీనం అయినట్టు చరిత్రలో లేదని అన్నారు. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూర్చి, పదవులు ఇచ్చి బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు సీబీఐ, ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరి లబ్ధి పొందిన విషయంలో అన్ని ఆధారాలను సేకరించామని, ఈ ఆధారాలతో కోర్టుకు వెళతామని మల్లురవి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment