సాక్షి, హైదరాబాద్ : పైన మెట్రో పరుగులు.. కింద వాహనాల ఉరుకులు.. నగరం రోజురోజుకూ రద్దీగా మారుతోందనడానికి ఈ చిత్రమే నిదర్శనం. కోరలు చాచిన కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే నగర జీవనం గాడినపడుతోందని భావిస్తున్న తరుణంలో ‘సెకండ్ వేవ్’ కలవరానికి గురిచేస్తోంది. జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనా ముప్పు నుంచి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో సిటీజనులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. గురువారం సాయంత్రం పుత్లీబౌలి– మొజంజాహీ మార్గంలో కనిపించిందీ దృశ్యం. చదవండి: హెల్మెట్ లేకుంటే 3 నెలలు లైసెన్స్ రద్దు!
ఓల్డ్ బోయిన్‌పల్లి: కోవిడ్ సెకండ్ వేవ్ మొదలవడంతో కరోనా పరీక్షలు రోజుకు 50 నుంచి 200 లకు పెంచారు. ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ అంజయ్యనగర్‌లోని బస్తీ దవాఖానా వద్ద ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో నేటి నుంచి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఇన్‌ఛార్జి, ల్యాబ్ టెక్నిషియన్ కీర్తి తెలిపారు. డివిజన్‌కు ఒకే సెంటర్ ఉండటంతో సుదూర ప్రాంతాల వాసులు ఇక్కడికి రావడానికి అంతగా సుముఖత చూపడం లేదు. అంజయ్యనగర్ టెస్ట్ సెంటర్ నుంచి ఓల్డ్ బోయిన్‌పల్లి, ఆర్‌ఆర్‌నగర్, అలీ కాంప్లెక్స్, దుబాయిగేట్, స్వర్ణధామనగర్ ప్రాంతాలకు దూరం కావడంతో అక్కడి ప్రజలు పరీక్షల కోసం రావడానికి ఆసక్తి చూపడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో హస్మత్‌పేట చెరువుకు అటువైపు అంజయ్యనగర్ ఉండగా ఇటు పక్కన ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లోని కాలనీలు, బస్తీలు ఉన్నాయి. అంజయ్యనగర్‌కు రావాలంటే దూరం కావడంతో మరో సెంటర్‌ను ఓల్డ్ బోయిన్‌పల్లి వార్డు కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఒకే సెంటర్ ఉండడంతో జనాలు గుంపులు గుంపులుగా రావడంతో కొందరు భయపడి పరీక్షల కోసం రావడం లేదు.
⇔ జూలై 12వ తేదీ నుంచి అంజయ్యనగర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇప్పటి వరకు 2821 మందికి టెస్ట్‌లు నిర్వహించగా 600 మందికి పాజిటివ్ వచ్చింది. 9 మంది మృత్యువాత పడ్డారు.
⇔ గతంలో రోజుకు 50 మందికి మించి టెస్ట్‌లు చేసే అవకాశం లేదని, ప్రస్తుతం రెండు వందల మంది వచ్చినా∙టెస్ట్‌లు చేస్తామని కీర్తి తెలిపారు.
⇔ ప్రసుత్తం రోజుకు 30 నుంచి 40 మంది వరకే వస్తున్నారు.
⇔ జలుబు, దగ్గు, గొంతునొప్పి, లక్షణాలు ఉంటే తక్షణమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి.
⇔ రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి.
⇔ మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి.
⇔ పరిసరాలు, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment