సాక్షి, హైదరాబాద్: కొంచెం అటు ఇటుగా భారతదేశానికి కరోనా అన్న పదం, మహమ్మారి వ్యాధి పరిచయమై ఏడాది దాటుతోంది. 2019 నవంబర్‌లో చైనాలోని వూహాన్‌లో తొలిసారి గుర్తించిన కరోనా వ్యాధి ఆ తర్వాత ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. వ్యాధి తాలూకు కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో 2020 జనవరి 23న వూహాన్ నగరం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు. జనవరి 30న కేరళలో తొలి కోవిడ్–19 కేసు నమోదైంది. మొదట్లో కేసుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా రోజులు గడుస్తున్న కొద్దీ మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడుల్లో వందల మంది వైరస్‌బారిన పడటం మొదలైంది. తొలి కేసు నమోదైన తరువాత సుమారు రెండు నెలలకు అంటే మార్చి నాలుగవ వారంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మొదలయ్యే సమయానికి వ్యాధి అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది.
వ్యాధి గురించి తెలిసిన తొలినాళ్లలో దీని వ్యాప్తిపై కొన్ని పరిశోధనలు జరిగాయి. వాటి ప్రకారం ఒక దశలో రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షల వరకూ చేరుకోవచ్చునని, మరణాలు కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయని ఈ పరిశోధనలు తెలిపాయి. అదృష్టమో.. మరే ఇతర కారణమో స్పష్టంగా తెలియదు కానీ అంతటి విపత్తు మాత్రం రాలేదు. 2020 సెప్టెంబర్ నాటికి రోజువారీ కేసులు 99 వేల స్థాయికి చేరి ఆ తర్వాత నెమ్మదిగా తగ్గడం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కేసుల సంఖ్య తగ్గుతూనే ఉంది. చాలామంది ఊహించినట్లు అమెరికా, ఐరోపా దేశాల్లోలాగా సెకెండ్ వేవ్ మన దగ్గర కన్పించట్లేదు.
శాస్త్రవేత్తలకూ అంతుచిక్కట్లే..
అమెరికా, ఐరోపా దేశాలు ప్రస్తుతం మూడు, నాలుగో సారి కోవిడ్ బారిన పడి కష్టాలు అనుభవిస్తున్నాయి. భారత్‌లో మాత్రం అందుకు విభిన్న పరిస్థితి ఉండటం శాస్త్రవేత్తలకూ అంతుచిక్కట్లేదు. సెప్టెంబర్‌లో కేసుల సంఖ్య రోజుకు లక్ష వరకు చేరిన దాంతో పోలిస్తే ప్రస్తుతం 90 శాతం వరకూ కేసులు తగ్గిపోయాయి. మరణాలు కూడా అంతే. సెప్టెంబర్‌లో రోజువారీ మరణాల సంఖ్య వెయ్యికిపైగా ఉంటే.. ఇప్పుడది వంద కంటే తక్కువ. ఇందుకు కారణం హెర్డ్ ఇమ్యూనిటీ సాధించామని కొందరు చెబుతున్నారు. భారత వైద్య పరిశోధన సమాఖ్య తాజా సీరో సర్వే ప్రకారం మాత్రం దేశవ్యాప్తంగా కోవిడ్–19 యాంటీబాడీలు 20 శాతం జనాభాలో ఉన్నాయి. అయితే 60 శాతం కంటే ఎక్కువ మంది జనాభాలో యాంటీబాడీస్ ఉన్నప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమనేది నిపుణుల మాట. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం కూడా దేశ జనాభాలో 25 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు లెక్కగట్టింది.
యువత ఎక్కువగా ఉండటం వల్లే?
భారత్‌లో ఎక్కువ శాతం మంది యువత కావడం సెకెండ్ వేవ్‌ను అడ్డుకుందన్న వాదన వినిపిస్తున్నారు. వేర్వేరు వ్యాధులకు ఇప్పటికే నిరోధకత సాధించడం కూడా కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అంతా బాగుందనుకునేందుకు వీల్లేదని, మరికొన్ని నెలల పాటు జాగ్రత్తలు పాటించాల్సిందేనని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. యూకేలో బయటపడ్డ కొత్త రకం కోవిడ్–19 కారక వైరస్ భారత్‌పై పెద్దగా ప్రభావం చూపకపోయినా దక్షిణాఫ్రికా రకం వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కావడం, రెండో డోసు ఇస్తున్న నేపథ్యంలో సెకెండ్, థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదని, కాకపోతే శాస్త్రీయంగా ఈ అంశాలను నిర్ధారించుకునేంత వరకు నిర్లక్ష్యంగా ఉండొద్దని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment