సాక్షి, సిటీబ్యూరో: ‘అప్పుడు రోజుకు రెండు వందల చాయ్‌లు అమ్మిన. ఇప్పుడు యాభై చాయ్‌లు కూడా అమ్ముడైతలేవు. చాయ్ బండి పెట్టుకొన్నందుకు స్థలం యజమానికి ప్రతి రోజు నాలుగు వందల రూపాయలు అద్దె కట్టాలె. వారం, పది రోజుల నుంచి గిరాకీ లేదు. అప్పు తెచ్చి అద్దె కట్టవలసి వస్తుంది. ఎట్ల బత్కాలె....’ తార్నాక చాయ్‌బండి సంతోష్ ఆవేదన ఇది. సంతోష్ దగ్గర చాయ్ తాగితే తప్ప తమ దినచర్య మొదలు కాదని భావించే ఎంతోమంది చాయ్ ప్రియులు ఇప్పుడు సంతోష్ బండి దగ్గరకు రావడం మానేశారు. చిక్కటి గరం గరం చాయ్ గొంతులోకి దిగితే తప్ప రోడ్డుమీద నాలుగడుగులు వేయలేని వాకర్స్ సైతం అటు వైపు తొంగి చూడడం లేదు.
పక్క హోటళ్లలో టిఫిన్ చేసి సంతోష్ బండి దగ్గర చాయ్ తాగే చాలా మంది మహమ్మారి భయానికి బయట టిఫిన్‌లు, చాయ్‌లు అన్నీ మానేశారు. ఇది ఒక్క సంతోష్‌కు మాత్రమే వచ్చిన కష్టమే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లో చిన్న చిన్న చాయ్‌బండ్లను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్న సుమారు 50 వేల మందికి పైగా చాయ్‌వాలాలు ఇదే కష్టాల్లో ఉన్నారు. ఇళ్ల కిరాయిలు, అడ్డాల అద్దెలు చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ‘పొట్ట చేత పట్టుకొని ఊళ్లకు ఊళ్లు దాటి హైదరాబాద్‌కు వస్తే లాక్‌డౌన్ కారణంగా బతుకు భార మైంద’నే ఆవేదన సంతోష్ లాంటి ఎంతోమంది చాయ్‌వాలాలను ఆందోళనకు గురిచేస్తోంది.
చేదెక్కిన చాయ్...
తెల్లవారు జామున రోడ్డెక్కే పారిశుధ్య కార్మికులు మొదలుకొని వీధి వ్యాపారులు, వివిధ రకాల పనులపై రోడ్లపైకి వచ్చేవాళ్లు ఎక్కడో ఒక చోట ఓ కప్పు చాయ్ విధుల్లోకి చేరుతారు. పనిలో ఒత్తిడి నుంచి ఊరట పొందాలన్నా, కాస్త అలసట తగ్గాలన్నా గుక్కెడు చాయ్ గొంతు దిగాల్సిందే. అలాంటి చాయ్ ఇప్పుడు కోవిడ్ కారణంగా చేదెక్కింది. వేడివేడి చాయ్ కప్పుతో కరోనా ముప్పు లేకపోయినా పది మంది గుమిగూడ చోటకు వెళ్లడం వల్ల వైరస్ వ్యాపించవచ్చుననే భయాందోళనతో జనం బయట చాయ్ తాగేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
ఉదయం 5.30 నుంచే చాయ్ బండ్లు, టిఫిన్ సెంటర్‌లు, హోటళ్లు తెరుచుకుని ఉన్నా ఉదయం 10 గంటల వరకు పట్టుమని పది మంది గిరాకీ కూడా లేని సెంటర్‌లు ఉన్నాయి. లాక్‌డౌన్ వల్ల అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావడం లేదు, ముఖ్యంగా పాలు, కూరగాయలు, కిరాణా వస్తువుల కోసం మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. సాధారణ జనజీవనం స్తంభించడంతో ఫుట్‌పాత్ గిరాకీ పూర్తిగా దెబ్బతిన్నది.
దందా లేదు...
కర్ణాటకలోని బీదర్ నుంచి ఎనిమిదేళ్ల క్రితమే వచ్చాడు సంతోష్ మల్లికార్జున్ సజ్జన్. భార్య, ఇద్దరు పిల్లలు. లాలాపేట్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములంతా బీదర్‌లోనే ఉన్నారు. సంతోష్ మొదట్లో తార్నాకలోనే ఓ పండ్లదుకాణంలో కొంతకాలం పని చేశాడు. కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులతో రెండేళ్ల కిందట చాయ్ బండి కొనుక్కున్నాడు. కొద్ది రోజుల్లోనే సంతోష్ చేసి ఇచ్చే చాయ్‌కు ఆదరణ లభించింది. ఒక భరోసా లభించింది.
కానీ కరోనా కారణంగా ఏడాది కాలంగా తిరిగి కష్టాలు మొదలయ్యాయి. ‘గిరాకీ ఉన్నా లేకున్నా పాలు, చాయ్‌పత్తా, చక్కెర కొనవలసి వస్తుంది. ఈ రోజు రాకపోయినా రేపైనా వస్తుందేమోనని ఆశ కొద్దీ బండి తెరుస్తున్నా. కానీ చూస్తుండగానే తొమ్మిదయిపోతుంది. పోలీసులొచ్చి వెళ్లిపోమ్మని బెదిరిస్తున్నారు. ప్రతి రోజు ఆశతో వచ్చి నిరాశతో వెళ్తున్నా. ఇంటికెళ్లగానే నా నాలుగేళ్ల కొడుకు, రెండున్నరేళ్ల పాప ఎదురుగా కనిపిస్తారు. భవిష్యత్తు గురించి చాలా భయంగా ఉంది..’ వేలాది మంది సంతోష్ ఆవేదన కూడా ఇదే.
చదవండి: ఓరి నాయనో.. డెలివరీ బాయ్స్‌లా వేషం, బ్యాగ్‌లో ఫుడ్ కూడా!
Comments
Please login to add a commentAdd a comment