
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, రెబ్బెన(కోమురంభీం జిల్లా): కరోనా మహమ్మారి దంపతులకు కడుపుకోత మిగల్చింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు, కుమార్తెను కబలించింది. వారం వ్యవధిలో ఇద్దరూ దూరం కావడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. కరోనాతో అక్కాతమ్ముడు మృత్యువాత పడడంతో మండలంలోని గోలేటిలో విషాదం అలుముకుంది. గోలేటికి చెందిన యువకుడు(20) గత బుధవారం కరోనాతో మృతి చెందాడు. మరోసటి రోజు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతోపాటు అతడి అక్క(21) కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో అక్కకు పాజిటివ్ వచ్చింది. ఆమెను గోలేటిలోని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తమ్ముడు మృత్యువాత పడడం ఓ వైపు, మహమ్మారి సోకిందనే బాధ మరో వైపు ఆమెను వేదనకు గురిచేశాయి. మంగళవారం ఉదయం ఐసోలేషన్ సిబ్బంది ఆమెను ఇంటికి తీసుకెళ్లవచ్చని సూచించారు. కూతురు ఆరోగ్యపరిస్థితి మెరుగుపడిందని సంతోషిస్తూ ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఐసోలేషన్ సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు. అక్కడ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ బుధవారం ఉదయం మృతిచెందింది. మృతదేహానికి కరీంనగర్‌లోనే అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. వారంలోనే పిల్లలిద్దరూ చనిపోవడం వారిని కలిసి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment