Covid Vaccination In Telangana: Covishield Vaccine Reaches To Hyderabad, Vaccination Starts On Jan 16 - Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ వచ్చేసింది

Published Tue, Jan 12 2021 12:41 PM | Last Updated on Wed, Jan 13 2021 3:55 PM

Covishield Vaccine Reaches To Hyderabad - Sakshi

మంగళవారం పుణే నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కోవిషీల్డ్‌ టీకాలను విమానంలోంచి బయటకు తెస్తున్న కార్గో సిబ్బంది 

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్లు ఎట్టకేలకు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకు న్నాయి. పుణే నుంచి స్పైస్‌ జెట్‌ కార్గో విమానం మంగళవారం ఉదయం 11.30 గంటలకు శంషాబాద్‌ జీఎంఆర్‌ కార్గో టెర్మి నల్‌కు చేరుకుంది. ఈ విమానంలో ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు రాష్ట్రానికి వచ్చాయి. విమానాశ్రయం నుంచి ప్రత్యేక భద్రత నడుమ కోఠిలోని స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌కు చేరుకోగానే అధికారులు ఘనస్వాగతం పలికారు. మొత్తం 31 ప్రత్యేక ఇన్సులేటెడ్‌ పెట్టెల్లో 3.64 లక్షల వ్యాక్సిన్లు వచ్చాయి. మొదటి పెట్టెను ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు అందు కున్నారు. వాటిని దించగానే సర్వమత ప్రార్థనలు జరిగాయి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కొందరు అధికారులు కరోనా వ్యాక్సిన్‌ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వైరస్‌ అంతం ప్రారంభమైం దన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌లో వ్యాక్సిన్లను నిల్వ ఉంచారు. 

రీజినల్‌ కేంద్రాలకు తరలింపు ప్రారంభం...
స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ నుంచి టీకాలను 10 పూర్వ జిల్లాల్లో ఉన్న రీజినల్‌ కేంద్రాలకు మంగళవారం రాత్రి నుంచే తరలించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి టీకా కేంద్రాలకు 14వ తేదీ సాయంత్రానికి చేరుస్తారు. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారు. ఇప్పటికే టీకా కేంద్రాలకు 15 లక్షల సిరంజీలను తరలించారు. అలాగే సైడ్‌ ఎఫెక్టŠస్‌ వస్తే తక్షణమే వైద్యం చేసేందుకు అవసరమైన మెడికల్‌ కిట్లను జిల్లాలకు పంపించారు. ఇదిలావుండగా, స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌కు 20 వేల కోవాగ్జిన్‌ టీకాలు కూడా చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు. వాటిని కూడా కొన్ని జిల్లాలకు పంపుతామని తెలిపారు.

మంగళవారం సాయంత్రానికి తేలిన లెక్క ప్రకారం.. రాష్ట్రంలో తొలి విడత 3.30 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకాలు వేస్తారు. ఎవరు ఏ రోజు టీకాకు రావాలో టైం స్లాట్‌తో సహా వారి మొబైల్‌ ఫోన్లకు ఒక రోజు ముందు మెసేజ్‌లు పంపిస్తారు. ఈ నెల 16న 139 కేంద్రాల్లో టీకాలు వేయాలని, ఒక్కో కేంద్రంలో 100 మంది చొప్పున 13,900 మందికి వేయాలని తొలుత నిర్ణయించారు. కానీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. తొలి రోజున ప్రతీ కేంద్రంలో 30 మందికే టీకాలు వేయాలని మంగళవారం నిర్ణయించింది. 17న ఆదివారం సెలవు. ఇక 18 నుంచి నిత్యం టీకా కార్యక్రమాన్ని ఒకేసారి అన్ని కేంద్రాల్లో కాకుండా, రోజుకు కేంద్రాలను పెంచుకుంటూ పోతూ 20 నుంచి పూర్తిస్థాయిలో వేసుకుంటూ పోవాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. 

10 మంది వచ్చాకే టీకా...
వాయిల్స్‌లలో టీకా డోసులు ఉంటాయి. కోవిషీల్డ్‌ కంపెనీ టీకాలు ఒక్కో వాయిల్స్‌ల్లో 10 డోసులు ఉంటాయి. వాటిని 6 నెలల వరకు భద్రపరచవచ్చు. అయితే వాయిల్స్‌ను తెరిచిన 4 గంటల్లోపే 10 మందికి టీకాలు వేయాలి. తర్వాత అవి కాలంచెల్లిపోతాయి. అందువల్ల వ్యాక్సిన్‌కు ఒకేసారి 10 మంది ఇచ్చేలా ప్రణాళిక ఉంటుంది. ఇక కోవాగ్జిన్‌ టీకా పరిస్థితి అయితే ఒక వాయిల్‌లో 20 డోసులు ఉంటాయి. అంటే ఒక వాయిల్‌ను తెరిస్తే 20 మందికి ఒకేసారి వేయాలి. తక్కువ వేశాక నాలుగు గంటలోపు మిగిలినవి వేయకుంటే అవి కాలం చెల్లిపోతాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇలాంటి వృథాను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు 10 శాతం అదనంగా టీకాలను సరఫరా చేస్తాయి. అలాగే రాష్ట్రానికి వ్యాక్సిన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. 

ఈటలకు తొలి టీకాపై తర్జనభర్జన...
ఈ నెల 16న తొలి టీకా గాంధీ ఆసుపత్రిలో తొలి టీకా తానే వేసుకుంటానని మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించగా, ఆ మేరకు ఏర్పాట్లు జరిగాయి. ప్రజాప్రతినిధులు టీకాలు వేసుకోవడానికి క్యూ కట్టవద్దని ప్రధాని మోదీ సూచించిన నేపథ్యంలో మంత్రికి తొలి టీకాపై అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. ఈటల వేయించుకుంటే ఇంకొందరు ప్రజాప్రతినిధులు కూడా అలాగే వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఈటల అయోమయంలో పడ్డారు. తొలి టీకా వేసుకోకుంటేనే మంచిదని, లేకుంటే విమర్శలు వస్తాయని మంత్రితో అన్నట్లు తెలిసింది. పైగా కోవిన్‌ యాప్‌లో నమోదైన వారికే టీకాలు వేయాలి. ఈటల పేరు అందులో నమోదు కాలేదు. నిబంధనల ప్రకారం కూడా వేసుకోవడం సరైంది కాదని అంటున్నారు. ఇదిలావుంటే తొలి రోజు టీకా కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారా? లేదా? అన్న విషయంపైనా స్పష్టత రాలేదు. వైద్య సిబ్బందిలో ధైర్యం నింపేలా ఎక్కడో ఒకచోట పాల్గొనాలని వైద్య, ఆరోగ్యశాఖ సీఎంకు విన్నవించినట్లు సమాచారం. 

సజావుగా జరిపించండి..
వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సజావుగా జరిపించడంలో భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులను మంత్రి ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సర్పంచి మొదలు మంత్రుల వరకు అందరికీ లేఖలు రాశారు. ‘కష్టకాలంలో ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు చేదోడువాదోడుగా ఉన్నందుకు మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం తరుఫున హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈనెల 16 నుంచి వ్యాక్సిన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నాం. జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఈ ఏర్పాట్లను చూస్తున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్‌ అందించడానికి మీరు ఈ కార్యక్రమంలో క్రియాశీల పాత్ర పోషించాలని కోరుతున్నా. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సజావుగా జరిగి, తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా మారాలనే మన సీఎం ఆకాంక్షను నెరవేర్చాలని అభ్యర్థిస్తున్నా’అని కోరారు.

తొలిరోజు కొందరికే వ్యాక్సిన్‌: సీఎస్‌
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 16న కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తున్నందున తొలిరోజు కొద్దిమంది లబ్ధిదారులను మాత్రమే కేంద్రాలకు అనుమతించాలని, ఆ అనుభవాల మేరకు ప్రణాళిక చేసుకొని మరుసటి రోజు నుంచి లబ్ధిదారులను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై మంగళవారం ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పనిచేస్తున్న వైద్యారోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గుర్తించి కలెక్టర్లు ఏర్పాటు చేయాలన్నారు.

టీకా కేంద్రాల్లో నిర్దేశిత ఆపరేషన్స్‌ గైడ్‌లైన్స్‌ మేరకు వసతులు కల్పించాలని, వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎవరికైనా రియాక్షన్‌ వస్తే తక్షణమే వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి వ్యాక్సినేషన్‌ కేంద్రం లో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్లను రిజర్వులో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. గుర్తించిన లబ్ధిదారులను కేంద్రాలకు చేర్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement