సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో రూ.38,500 కోట్ల అంచనాతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టగా.. తెలంగాణ వచ్చాక రీ–ఇంజనీరింగ్ ద్వారా కాళేశ్వరం, ప్రాణహిత అనే రెండు ప్రాజెక్టులుగా విభజించడంతో అంచనా వ్యయం రూ.85,651.81 కోట్లకు చేరిందని కాగ్ నివేదికలో పేర్కొంది. అంటే ప్రాజెక్టు వ్యయం 122శాతం పెరిగిందని.. కానీ లక్షిత ఆయకట్టు 52.22శాతమే పెరిగిందని వివరించింది. ఆ తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పు లు, చేర్పులు చేయడంతో అంచనా వ్యయం రూ. 1,47,427.41 కోట్లకు చేరినా.. ప్రయోజనాలేమీ పెరగలేదని పేర్కొంది. కాళేశ్వరంపై 2021–22 ఆర్థిక ఏడాది చివరినాటికి కాగ్ నిర్వహించిన ఆడిట్ నివేదికను ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. నివేదికలోని ముఖ్యాంశాలివీ..
పంపింగ్ పెంచడంతో అదనపు వ్యయం
కాళేశ్వరం డీపీఆర్‌ను 2018 జూన్‌లో కేంద్ర జలసంఘం ఆమోదించడానికి ముందే రూ.25,049.99 కోట్ల విలువైన 17 పనులను నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లకు అప్పగించింది. తొలుత గోదావరి నుంచి రోజుకు 2టీఎంసీలను ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. తర్వాత అవసరం లేకున్నా పంపింగ్‌సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచడంతో రూ.28,151 కోట్ల అదనపు వ్యయం అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపారు. ఇతర ప్రాజెక్టుల కింద ఒక టీఎంసీ నీళ్లు 10వేల ఎకరాలకే సరిపోతాయని చూపగా.. కాళేశ్వరం కింద 17,668 ఎకరాలకు అందించవచ్చని లెక్కించారు. తాజా అంచనా రూ. 1.47 లక్షల కోట్లలెక్కన చూస్తే.. ప్రాజెక్టు ప్రయోజన–వ్యయ నిష్పత్తి 0.52గా తేలుతోంది. అంటే వెచ్చించే ప్రతి రూపాయికి 52 పైసలే ప్రయోజనం అందుతుంది. ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ చార్జీలు, నిర్వహణ కలిపి రూ.10,647.26 కోట్ల ఖర్చు అవుతుంది. ఒక్కో ఎకరాకు సాగునీరు అందించడానికి ఏటా రూ.46,364 లెక్కన వ్యయం అవుతుంది.
చెల్లింపుల వాయిదాతో మరింత భారం
కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలను తిరిగి చెల్లించడానికి వచ్చే 14ఏళ్లలో మొత్తం రూ.1,41,544.59 కోట్లు అవసరం కానున్నాయి. కొన్ని రుణాల తిరిగి చెల్లింపు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వాయిదా కోరింది. దీనితో రూ. 8,182.44 కోట్ల మేర అదనపు వడ్డీ భారం పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 21 ఒప్పందాల పరిధిలో పంపులు, మోటార్లు, అనుబంధ పరికరాల కొనుగోళ్ల కోసం వాస్తవ ధరల కంటే అధికంగా వ్యయా న్ని అంచనా వేశారు. వీటిలోని నాలుగు పనుల్లో కాంట్రాక్టర్లకు రూ.2,684.73 కోట్ల మేర అనుచిత లబ్ధి కలిగే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఐదు ఒప్పందాల్లో టెండర్లు పూర్తయ్యాక ధరల సర్దుబాటుతో అధిక చెల్లింపులు జరిగాయి.
నీరిచ్చింది 40,888 ఎకరాలకే..
ప్రాజెక్టు కింద 18.26లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును ప్రతిపాదించారు. ఇందులో 14.83లక్షల ఎకరాల మేర మాత్రమే కాల్వల వ్యవస్థను అభివృద్ధి పనులను చేపట్టారు. 2022 మార్చి చివరినాటికి వాస్తవంగా నీళ్లిచ్చింది 40,888 ఎకరాలకే. ఇక మల్లన్నసాగర్ జలాశయం ప్రాంతంలోని భూగర్భంలో నిటారుగా పగుళ్లు ఉన్నాయని, భూకంపాలకు అవకాశం ఉందని నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment