(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : గత పదేళ్లలో తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగింది. దేశంలో ఆంధ్రప్రదేశ్ (647 చ.కి.మీ) తర్వాత పచ్చదనం పెరిగిన రెండో రాష్ట్రం తెలంగాణ అని ఇండియన్ ఫారెస్ట్ సర్విస్ రిపోర్ట్ తాజాగా వెల్లడించింది. తెలంగాణలో వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న సమయంలో ఇది సంతోషకర పరిణామమే అయినా.. పర్యావరణవేత్తలు, జీవ వైవిధ్య నిపుణులు మాత్రం ఒక అంశంపై పెదవి విరుస్తున్నారు.
అదేమిటంటే.. విస్తరిస్తున్న వనాల్లో స్థానిక మొక్కలు లేకపోవడం, ట్రాన్స్‌లొకేషన్ (భారీ వృక్షాలను ఒకచోటి నుంచి మరోచోటికి తరలించడం)లో సక్సెస్ రేటు సగం కూడా లేకపోవటమే. దక్కన్ పీఠభూమి విస్తారమైన ఆయుర్వేద మొక్కల నిలయమని, దేశంలోని జీవవైవిధ్య మండలాల్లో అత్యధిక దిగుబడి, పునరుత్పత్తి కలిగిన పశ్చి మ, తూర్పు కనుమల్లోని మొక్కలు, వృక్షాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కనిపించే పరిస్థితి ఉండేదని నిపుణులు చెప్తున్నారు. కానీ నేడు ఎక్కడ చూసినా విదేశీ జాతుల మొక్కలకే ప్రాధాన్యమివ్వటం వల్ల జీవవైవిధ్యానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తలెత్తుకు నిలబడింది..
మూసీ ఒడ్డున ఉస్మానియా ఆస్పత్రి ఆవరణలోని ఈ చింతచెట్టు వయసు సుమారు 425 సంవత్సరాలపైనే. అయినా నిటారుగా నిలబడింది. వానలు, వరదలెన్ని వచ్చినా కదల్లేదు.. కారణం లోకల్ జాతి కావటమే. ఇక్కడి వాతావరణం, భూమితో పెనవేసుకున్న బలమైన బంధంతో ఇంకా అందరి ‘చింత’తీరుస్తోంది. ఈ చెట్టే 1908 నాటి మూసీ వరదల్లో 150 మంది ప్రాణాలు కాపాడింది. ఆ ఏడాది సెపె్టంబర్ 27, 28 తేదీల్లో కుండపోత వానతో మూసీ ఉప్పొంగి తీర ప్రాంతాలను ముంచెత్తగా.. ఈ చెట్టు ఎక్కి కూర్చున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. అందుకే ఈ చెట్టుకు ఏటా సెప్టెంబర్ 28న ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తారు.
‘బాగ్’నగర్‌లో.. బాగ్‌లు మాయం..
హైదరాబాద్ అంటేనే ‘బాగ్ నగర్’.. అంటే ఉద్యాన వనాల నగరం అని అర్థం. అప్పట్లో నగరమంతా పరుచుకున్న మొక్కలు, వృక్షాలన్నీ అన్నీ స్థానిక వెరైటీలే. నగరంలో జాంబాగ్, కుందన్‌బాగ్, సీతారాంబాగ్, బషీర్‌బాగ్, రాంబాగ్, పూల్‌బాగ్, కిషన్‌బాగ్,, మూసారాంబాగ్ , ఇబ్రహీంబాగ్, బాగ్‌లింగంపల్లిలతోపాటు చింత వనాలతో నిండిన ఇమ్లీబన్, చింతలబస్తీలతో హైదరాబాద్ నగరం ప్రపంచ జీవ వైవిధ్య పటంలో ప్రత్యేకంగా నిలిచేది.
తూర్పు, పశ్చి మ కనుమల్లో ఉండే ప్రతిమొక్క, వృక్షం మూసీ పరీవాహకంతోపాటు హైదరాబాద్ నగరంలో కనిపించేవని పర్యావరణవేత్త డాక్టర్ కె.పురుషోత్తంరెడ్డి చెప్తున్నారు. అందులో అత్యధికం ఔషధ గుణాలున్నవేనని.. గండిపేట నీళ్లు, హైదరాబాద్ గాలి తాకగానే మనుషుల్లో మార్పు స్పష్టంగా కనిపించేదని అంటున్నారు.
కానీ క్రమంగా జనావాసాలు పెరగడం, కాలనీలు, రోడ్ల విస్తరణ, ప్రభుత్వ, చెరువు భూముల కబ్జాలతో స్థానిక రకాలైన మర్రి, రావి, వేప, చింత, నేరేడు తదితర వృక్షాలన్నీ కనిపించకుండా పోయాయి. వాటి స్థానంలో అందం కోసమంటూ ఇతర ప్రాంతాలు, దేశాలకు చెందిన మొక్కలు, చెట్లను పెంచేశారు. కానీ అవి బలంగా లేక, ఈదురుగాలులకు కూలిపడుతుండటంతో ఏటా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది.
హరితహారంలోనూ ఇలాగే..!
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలోనూ విదేశీ జాతుల మొక్కలనే ఎక్కువగా నాటుతున్నారు. స్థానిక జాతులైతే పెరిగేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయని.. వేగంగా పెరిగే విదేశీ జాతులను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఎడారి దేశాల్లో పెరిగే ‘కోనోకార్పస్’అనే మొక్కను రాష్ట్రమంతటా నాటారు. పెద్దగా నీటి తడి లేకున్నా పెరిగి, ఏడాదంతా పచ్చగా కనిపించే ఈ చెట్లు ఇప్పుడు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోనూ కనిపిస్తున్నాయి.
అయితే కోనోకార్పస్ పూల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ, శ్వాసకోశ, ఆస్తమా వంటి సమస్యలు వస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. వాటి వేర్లు లోతుగా పాతుకుపోతూ.. మధ్యలో అడ్డు వచ్చే కమ్యూనికేషన్ కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు, మంచినీటి వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని.. సమీపంలో ఇతర చెట్లు పెరగకుండా చేస్తున్నాయని గుర్తించారు. ఈ చెట్ల ఆకులను స్థానిక జంతువులేవీ తినవు కూడా. దీంతో ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాలు కోనోకార్పస్ నాటడాన్ని నిషేధించాయి.
ట్రాన్స్‌లొకేషన్.. ట్రాజెడీయే..
రహదారుల విస్తరణ సమయంలో భారీ వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్ చేస్తున్నా.. తదనంతర జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఆశించిన ఫలితం రావటం లేదు. అదే విధంగా వేసవి కాలంలో ట్రాన్స్‌లొకేషన్ చేయొద్దు. అయినా ఇదే సమయంలో చేస్తున్నారు. ట్రాన్స్‌లొకేషన్‌కు సంబంధించి త్వరలోనే ఓ ప్రొటోకాల్ విడుదల చేయనున్నాం. – ఉదయకృష్ణ, వట ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
ఇక్కడి ప్రతి మొక్కలో ఔషధ గుణాలే..
దక్కన్ పీఠభూమిలో పెరిగే ప్రతి మొక్క జీవ వైవిధ్యానికి పనికి వచ్చేదే. ప్రకృతి వర ప్రసాదాన్ని మనం రక్షించుకోలేకపోతున్నాం. ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడ్డ వృక్షాలను తొలగించి.. వాటి స్థానంలో కాత, పూత లేని విదేశీ మొక్కలను నాటుతున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. తూర్పు, పశ్చి మ కనుమల్లో కనుగొన్న అపార వృక్ష సంపదను ప్రత్యేక విభాగాలతో సంరక్షించాల్సి ఉంది. – డాక్టర్ కె.తులసీరావు, జీవ వైవిధ్య నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment