సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం దాదాపు 11 గంటల పాటు ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ అధికారులు.. 14 ప్రశ్నలు అడిగారని తెలిసింది. విచా రణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలంటూ కవిత చేసిన విజ్ఞప్తి మేరకు.. అధికారులు విచారణను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే విచారణకు పిలిచారని ఈడీ అధికారులతో కవిత అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇది కేవలం రాజకీయ కుట్ర అని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిడితో ఈడీలో పారదర్శకత లోపించిందని చెప్పారు.
‘ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో నన్ను నిందితురాలిగా పిలిచారా?’ అని ప్రశ్నించారు. ‘కాదు..’ అని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిసింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముందని కవిత ప్రశ్నించారని సమాచారం. అలాగే తను ఫోన్ ధ్వంసం చేసినట్టు మీడియాకు లీకులెవరిచ్చారని కూడా కవిత ప్రశ్నించారు. గత విచారణలో స్వా«దీనం చేసుకున్న తన ఫోన్ పూర్తిగా చెక్ చేసుకోవచ్చని అన్నారు. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే అధికారులు విచారిస్తున్నారని, అయినా విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు. కాగా సోమవారం కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్న గంట తర్వాత అధికారులు వచ్చారని, చాలాసేపు కవిత ఒక్కరినే రూమ్ కూర్చోబెట్టారని సమాచారం.
చదవండి: హస్తినలో హైటెన్షన్
Comments
Please login to add a commentAdd a comment