భట్టి ఇంట్లో చోరీ నిందితుల రిమాండ్‌ | Deputy CM Bhatti Vikramarka House Robbery Accused remanded | Sakshi
Sakshi News home page

భట్టి ఇంట్లో చోరీ నిందితుల రిమాండ్‌

Published Sun, Oct 6 2024 3:33 AM | Last Updated on Sun, Oct 6 2024 3:33 AM

Deputy CM Bhatti Vikramarka House Robbery Accused remanded

మరో ఇద్దరి కోసం పోలీసుల గాలింపు 

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇంట్లో నగదు, నగల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన రోషన్‌ కుమార్‌ మండల్‌ కొంతకాలంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో పని చేస్తున్నాడు. 

ఇటీవల భట్టి అమెరికా పర్యటనకు వెళ్లగా.. ఇంట్లోని బెడ్రూంలోని రోషన్‌ మండల్‌ అల్మరా తాళాలు పగులగొట్టి రూ.2.50 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసి తన స్నేహితులు ఉదయ్‌కుమార్‌ మండల్, కృష్ణ, సంజులతో కలిసి ఉడాయించాడు. గత నెల 24న సాయంత్రం చోరీ చేసిన నగదు, వస్తువులతో ఉదయ్‌కుమార్, సంజు, కృష్ణలతో కలిసి నాంపల్లి దాకా ఆటోలో వెళ్లి అక్కడి నుంచి రైలులో ఘట్‌కేసర్‌ వెళ్లారు. ఘట్‌కేసర్‌లో రైలెక్కి కాజీపేటలో దిగి అక్కడ మళ్లీ విజయవాడ రైలెక్కారు. విజయవాడ నుంచి విశాఖలో రైలు దిగి అక్కడి నుంచి బిహార్‌ ఖరగ్‌పూర్‌ రైలెక్కారు. గత నెల 26వ తేదీ ఉదయం ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో దిగిన వీరు అనుమానాస్పదంగా సంచరించడంతో అక్కడి రైల్వే పోలీసులు గుర్తించారు. 

కృష్ణ, సంజు అక్కడి నుంచి పారిపోగా.. ప్రధాన నిందితుడు రోషన్‌ కుమార్, ఉదయ్‌కుమార్‌లు పట్టుబడ్డారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ రాంబాబు బృందం ఖరగ్‌పూర్‌ వెళ్లి పీటీ వారెంట్‌ వేసి నిందితులను నగరానికి తీసుకువచ్చి శనివారం నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు. నిందితులిద్దరికీ 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. మిగతా ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement