సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేర పరిశోధన, ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరు, పీడీ చట్టం కింద కేసుల నమోదు, రైతు ఆత్మహత్యలు, కోర్టు కేసులు తదితర అంశాలపై డీజీపీ అంజనీకుమార్ శనివారం తన కార్యాలయం నుంచి సమీక్షించారు.
సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీ షికాగోయల్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి జోనల్ ఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజిటింగ్ వీసాలపై రాష్ట్రానికి వచ్చే విదేశీయుల కదలికలపైనా నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. విదేశీయులు రాష్ట్రంలో ఏ అనధికారిక సమావేశాల్లో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, పీడీయాక్ట్ కేసుల నమోదులో నిబంధనలను అనుసరించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో పీడీ చట్టం కేసుల నమోదు ఏకరీతిన ఉండాలని సూచించారు. పీడీ చట్టం ప్రయోగంపై కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నమోదులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ పేర్కొన్నారు.
వచ్చే వారంలో జరిగే శివరాత్రి పర్వదినం సందర్బంగా ఏ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ధిక్కరణ (కంటెంప్ట్) లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో భారీ సంఖ్యలో పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవనున్న నేపథ్యంలో శిక్షణపై దృష్టి పెట్టాలన్నారు. పీడీ చట్టాల నమోదులో తీసుకోవలసిన జాగ్రత్తలపై హైకోర్టులో పోలీస్ శాఖ జీపీ ముజీబ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment