
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వాతావరణం సమీపిస్తున్నందున శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి పోలీస్ ఉన్నతాధికారి వారి పరిధిలోని గ్రామాల సందర్శన కొనసాగించాలని సూచించారు. నగరంలో ఏర్పా టు చేసిన డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా హాట్‌స్పాట్ల గుర్తింపు, పోలీసుల ప్రవర్తన తదితర అంశాలపై డీజీపీ చర్చించారు. శాంతిభద్రతల అడిషల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పలు సూచనలు చేశారు.
ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి పదిమంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్ నివారణలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అంబేడ్కర్ చిత్రపటానికి డీజీపీ నివాళులర్పిం చారు.