Digital Survey of Agricultural Lands: ‘సర్వే’త్రా చర్చ..! | Digital Survey Of Lands Become Hot Topic In Telangana | Sakshi
Sakshi News home page

Digital Survey of Agricultural Lands: ‘సర్వే’త్రా చర్చ..!

Published Mon, Jun 7 2021 3:28 AM | Last Updated on Mon, Jun 7 2021 10:23 AM

Digital Survey Of Lands Become Hot Topic In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూములను డిజిటల్‌ సర్వే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజానీకం ఈ అంశాన్ని నిశితంగానే పరిశీలిస్తోంది. భూములను సర్వే ఎలా చేస్తారనే విషయంతో పాటు తమకేం కావాలన్న దానిపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. తమ అనుభవంలో ఉన్న  భూమిని సర్వే చేస్తే అందుకు సంబంధించిన పటం పక్కాగా ఉండాలి. ఆ పటం ఆధారంగా తమ భూమిని ఎక్కడి నుంచైనా గుర్తించగలగాలి. కొలవగలగాలి.

క్రయ, విక్రయ లావాదేవీలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదని ప్రజలు భావిస్తున్నారు. ఇలావుండగా.. సర్వే నిర్ణయం సహేతుకమైందేనని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి ప్రతి 30 ఏళ్లకు ఒక్కసారి ఈ సర్వే జరగాలి. ఒక అంచనా ప్రకారం 30 ఏళ్ల కాలంలో భూమి స్వభావం లేదంటే యాజమాన్య హక్కుల్లో మార్పులు జరుగుతాయి. దాదాపు 80 శాతం భూముల్లో ఈ మార్పు సంభవిస్తుంది. ఇందుకోసమే తాజా రికార్డులు (వివాదాలకు ఆస్కారం లేని) అందుబాటులో ఉండాలి. అయితే, ఒక్క సర్వేకు మాత్రం పరిమితం కాకుండా ఆ భూములపై యాజమాన్య హక్కులను సెటిల్‌ కూడా చేయాలి. లేదంటే తేనెతుట్టెను కదిపినట్టే అవుతుందని స్పష్టం చేస్తున్నారు.  

డిజిటల్‌ సర్వే ఇలా.. 
ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం రాష్ట్రంలోని భూములను డిజిటల్‌ సర్వే చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన ఏజెన్సీ రైతుల భూముల వద్దకు వెళ్లి ఆ భూమి హద్దులు చూపించమని అడుగుతారు. నాలుగువైపులా ఉన్న ఇతర భూముల యజమానులతో వివాదాలున్నాయో లేవో అడిగి తెలుసుకుంటారు. ఎలాంటి వివాదాలు లేనిపక్షంలో జీపీఎస్‌ లేదా ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టూల్‌ను ఉపయోగించి హద్దులు నమోదు చేసుకుంటారు. నాలుగు మూలలా ఆ భూమి అక్షాంశ, రేఖాంశాలు నమోదు చేసిన తర్వాత వచ్చే చుక్కల ఆధారంగా ఒక మ్యాప్‌ (పటం) గీస్తారు. దీంతో డిజిటల్‌ సర్వే పూర్తవుతుంది. ఈ మ్యాప్‌ను రైతుల పాస్‌పుస్తకంలో ఒక పేజీగా జత చేస్తారు. ప్రస్తుతానికి వివాదాలు లేని భూములు, వివాదాలున్న భూములను రెండింటినీ పైలట్‌ ప్రాజెక్టు కింద సర్వే చేసి ముందుకెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. 

ఎలాంటి సమస్యలొస్తాయి..? 
వివాదాలు లేని భూములు, ప్రభుత్వ శాఖల మధ్య వివాదాలున్న భూములపై పైలట్‌ సర్వేతో ఎలాంటి సమస్యలు రావని, విస్తృతంగా సర్వే చేసినప్పుడే సమస్యలు వస్తాయని నిపుణులు చెపుతున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రతి సర్వే నంబర్‌కు టిప్పన్‌ (రికార్డు)లున్నాయి. ఈ టిప్పన్‌లన్నింటినీ కలిపి గ్రామ నక్ష (మ్యాప్‌)లు తయారు చేశారు. ఈ నక్షలో ఎంత విస్తీర్ణం ఉంటే ఆ టిప్పన్‌లన్నింటి విస్తీర్ణం కూడా అంతే ఉండాలి. అయితే ఫలానా సర్వే నంబర్‌లో ఇంత భూమి ఉన్నట్టుగా రికార్డుల్లో పేర్కొన్న దానికి, సదరు రైతు అనుభవంలో ఉన్న వాస్తవ విస్తీర్ణానికి తేడా ఉంటుంది. ఇప్పుడు డిజిటల్‌ సర్వే చేస్తే క్షేత్రంలో ఉన్న భూమి మాత్రమే నమోదవుతుంది. అప్పుడు రైతు భావిస్తున్న లేదంటే పాస్‌ పుస్తకంలో ఉన్న విస్తీర్ణానికి, డిజిటల్‌ సర్వే ద్వారా వచ్చే విస్తీర్ణానికి తేడా వస్తుంది.

మరోవైపు ఫలానా రైతుకు ఫలానా గ్రామంలోని ఫలానా సర్వే నంబర్‌లో ఇంత విస్తీర్ణంలో భూమి ఉందని రికార్డులు పేర్కొంటాయి. అలా ఆ రైతుకు భూమి ఉన్న మాట వాస్తవమే అయినా సర్వే నంబర్‌లో తేడాలుంటాయి. రికార్డులో ఒక సర్వే నంబర్‌ ఉంటే రైతు ఇంకో సర్వే నంబర్‌లో భూమిని కలిగి ఉంటాడు. గత 80 ఏళ్లుగా సర్వే జరగలేదు కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కువగానే వస్తాయని రెవెన్యూ వర్గాలు అంచనా. మరో వైపు రాష్ట్రంలో దాదాపు 20–40 శాతం భూములకు సంబంధించిన టిప్పన్లు అందుబాటులో లేవు. భూములకు హద్దు రాళ్లు లేవు. అలాంటప్పుడు టిప్పన్‌ (రికార్డు) లేకుండా, హద్దులు గుర్తించకుండా సర్వే ఎలా జరుగుతుందన్నది ప్రశ్నార్థకమవుతోంది. ఈ సమస్యలు పరిష్కరించకుండా కేవలం సర్వేకు పరిమితం కావడం వల్ల సమస్యలు వస్తాయే కానీ శాశ్వత రక్షణ లభించదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.  

ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగింది..? 
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో భూముల సర్వే జరిగింది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ కూడా భూములను సమగ్రంగా సర్వే చేస్తోంది. గ్రామాల వారీగా వీఆర్వోలు, సర్వేయర్లు, గ్రామ వాలంటీర్లు, పంచాయతీ సిబ్బందితో కలిసి సర్వే ఆఫ్‌ ఇండియా సహకారం తీసుకుంటూ టైటిల్‌ గ్యారంటీ కట్టబెడుతూ సర్వేకు పూనుకుంది. కర్ణాటకలో గత రెండు దశాబ్దాలుగా ఇంక్రిమెంటల్‌ సర్వే అమల్లో ఉంది. అంటే లావాదేవీలు జరిగినప్పుడల్లా ఆ భూమిని సర్వే చేస్తారు. అలా సర్వే చేసిన రికార్డును మాత్రమే రిజిస్టర్‌ చేస్తారు. ఈ పద్ధతి వల్ల 90 శాతానికి పైగా భూవివాదాలు పరిష్కారం అయ్యాయని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఒడిశా, బిహార్‌లు కొత్త సర్వే చట్టాలను తయారు చేసుకుని సర్వేకు పూనుకున్నాయి. రాజస్తాన్‌ టైటిల్‌ సర్టిఫికేషన్‌ చట్టం తీసుకురాగా, మహారాష్ట్ర టైటిల్‌ గ్యారంటీకి సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రూపొందించుకుంది. 

ప్రజల మేనిఫెస్టోలో తొలి ప్రాధాన్యత సర్వేదే 
భూములు సర్వే చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముదావహం. ఇది ప్రజల అభిప్రాయానికి విలువివ్వడమే. ఎందుకంటే తెలంగాణ ప్రజల మేనిఫెస్టోలో తొలి ప్రాధాన్యత సర్వేదే. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు మేము 4 బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని 3 వేల కిలోమీటర్లు పర్యటించి, 10 వేల మందితో మాట్లాడి.. 1,000 మందిని కెమెరా ముందు మాట్లాడించిన తర్వాత కూడా సర్వే అభిప్రాయమే స్పష్టమైంది. అయితే సర్వేతో పాటు సెటిల్‌మెంట్‌ కూడా అనివార్యం.  
– భూమి సునీల్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్‌ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌  

మన ప్రభుత్వం ఏం చేయాలి.. 

  • కేవలం సర్వేతో పరిమితం కాకుండా సెటిల్‌మెంట్‌ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి.  
     
  • ప్రస్తుతం మన రాష్ట్రంలో సర్వే, హద్దుల చట్టం–1923 అమల్లో ఉంది. ఇప్పుడు సర్వే సమగ్రంగా చేయాలంటే కొత్త చట్టం తీసుకురావాలి. భూరికార్డులకు గ్యారంటీ ఇస్తూ టైటిల్‌ గ్యారంటీ చట్టం లేదంటే ఒడిశా, బిహార్‌ తరహాలో కొత్త చట్టం అమల్లోకి తేవాలి. 
     
  • సర్వే అంటేనే వివాదాలు వస్తాయి కనుక వివాద పరిష్కార వ్యవస్థను తీసుకురావాలి. మండల లేదా గ్రామ స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.  
     
  • పేదలు, నిరక్షరాస్యులకు అండగా ఉండేందుకు పారా లీగల్‌ వ్యవస్థను అందుబాటులోకి తేవాలి.  
     
  • సర్వే రికార్డులను భద్రపరిచేందుకు గాను బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను రూపొందించాలని కూడా నిపుణులు చెబుతున్నారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement