ఫిషరీస్‌ విద్యార్ధులు వల విసరడం కూడా నేర్చుకోవాలి.. | Diverse Training At PV NarasimhaRao Fisheries Research Center | Sakshi
Sakshi News home page

ఫిషరీస్‌ విద్యార్ధులు వల విసరడం కూడా నేర్చుకోవాలి..

Published Mon, Feb 22 2021 4:11 AM | Last Updated on Mon, Feb 22 2021 4:54 AM

Diverse Training At PV NarasimhaRao Fisheries Research Center - Sakshi

చేపల్ని తేలిగ్గా పట్టాలంటే వల 1.2 నుండి 3.6 మీటర్ల వ్యాసార్ధంతో ఉండాలి.. 
వలను నీటిలోకి విసిరే ముందు శరీర కదలికల్లో చూపే నైపుణ్యం, ఒడుపును బట్టి ఎన్ని చేపలు వలకు చిక్కుతాయనేది ఆధారపడి ఉంటుంది..
చేపల్ని పట్టాక ఎండలో ఉంచితే 45 నిమిషాల్లో చెడిపోతాయి. నీడలో ఉంచితే రెండున్నర గంటల వరకు తాజాగా వుంటాయి..
రవ్వ, బొచ్చె, బంగారుతీగ రకాల కంటే జయంతి రోహూ, అమూర్‌ కార్పు రకాలు 17 శాతం ఎక్కువ  దిగుబడులనిస్తాయి.. 

ఇవీ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ (బీఎఫ్‌ఎస్‌సీ) కోర్సు విద్యార్థులు ప్రాక్టికల్స్‌లో భాగంగా నేర్చుకుంటున్న పాఠాలు.. పొందుతున్న శిక్షణ.

సాక్షి, కూసుమంచి: ‘పిల్లలకు చేపల్ని కొనివ్వడం కాదు.. పట్టడం నేర్పిస్తే జీవితాంతం సుఖంగా బతుకుతారు’ అనేది వ్యక్తిత్వ వికాస తరగతుల్లో చెప్పే పాఠం. దీనికి తగ్గట్టే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగావకాశాల బాటలు వేస్తోంది పాలేరులోని పీవీ నరసింహారావు మత్స్య పరిశోధన కేంద్రం. ఇక్కడ తెలంగాణలోనే తొలి బ్యాచ్‌కు చెందిన బీఎఫ్‌ఎస్‌సీ విద్యార్థులు మరికొద్ది రోజుల్లో శిక్షణను పూర్తి చేసుకోనున్నారు. 

పెబ్బేరు టు పాలేరు
మత్స్య రంగం అభివద్ధికి పలు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం 2017లో వనపర్తి జిల్లా పెబ్బేరులో తొలి మత్స్య కళాశాలను ఏర్పాటుచేసింది. ఇంటర్మీడియట్‌ అనంతరం ఎంసెట్‌ రాసిన విద్యార్థులకు.. ర్యాంకు ఆధారంగా ఇక్కడి నాలుగేళ్ల బీఎఫ్‌ఎస్‌సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నారు. 25 సీట్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 14 జిల్లాలకు చెందిన విద్యార్థులు కోర్సును అభ్యసిస్తున్నారు. ఇక్కడ పాఠ్యాంశాల బోధన పూర్తి కావడంతో.. తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక మత్స్య పరిశోధన కేంద్రమైన పాలేరులో వీరంతా 120 రోజుల శిక్షణ పొందుతున్నారు. గతేడాది నవంబర్‌ 12న శిక్షణ ప్రారంభమైంది. కాగా, పెబ్బేరులోని మత్స్య కళాశాల, పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రం.. ఇవి రెండూ పీవీ.నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో ఔత్సాహికులకు మాత్రమే చేపల పెంపకం– యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్‌పై నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో విద్యార్థులకు చేపల పెంపకం దగ్గరి నుంచి వల విసరడం, ప్రాసెసింగ్‌వరకు శిక్షణనివ్వడం ఇదే తొలిసారని, ఇకపై ఏటా విద్యార్థులకు ఈ శిక్షణ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

తొమ్మిది అంశాలపై శిక్షణ
విద్యార్థులకు థియరీకి అనుగుణంగా తొమ్మిది అంశాల్లో ఇక్కడ రోజువారీ శిక్షణనిస్తున్నారు. వల విసరడం, చేపల పెంపకం, మేత తయారీ– యాజమాన్య పద్ధతులు, చేపపిల్లల ఉత్పత్తి, చేపల్లో వచ్చే వ్యాధులు–నివారణ చర్యలు, చేపల ప్రాసెసింగ్, చేపలతో విలువైన ఆహార ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, పర్యావరణ సమతుల్యం–చేపల పాత్ర వంటి అంశాలపై ప్రయోగాత్మక శిక్షణనిస్తున్నారు. ఇందులో భాగంగా వలను నేర్పుగా ఎలా విసరాలి? చేపల్ని ఎలా పట్టుకోవాలి? వాటిని ఎలా ప్రాసెస్‌ చేయాలనే దానిపై పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ జి.విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షణలో శాస్త్రవేత్త శాంతన్న, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోస్‌ నాగరాజు, నందిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పెబ్బేరు మత్స్య కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కిషన్‌కుమార్‌ శిక్షణను పర్యవేక్షిస్తున్నారు. 

అయితే ఉద్యోగం.. లేదంటే ఉపాధి
ప్రస్తుతం విద్యార్థులు వంద రోజులకుపైగా శిక్షణను పూర్తిచేసుకోగా, చివరి పది రోజుల్లో వీరిని విశాఖపట్నం హార్బర్‌కు తీసుకువెళ్లనున్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కలిగిస్తారు. ఇక్కడ నేర్చుకున్న శిక్షణ, కలిగిన అవగాహన ఆధారంగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌డీఓ)గా ఉద్యోగ అర్హత లభిస్తుందని, లేదా కన్సల్టెంట్లుగా, ఆక్వా రైతులకు సలహాదారులుగా, చేప ఉత్పత్తులు, ఆహార పదార్థాల తయారీలో నిపుణులుగా, చెఫ్‌లుగా స్వయం ఉపాధినీ కల్పించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సొంతంగా మత్స్య పరిశ్రమలు ఏర్పాటుచేసుకోవచ్చని, స్వయంగా చేపల పెంపకాన్ని చేపట్టవచ్చని అంటున్నారు. 

ఇదే తొలిసారి..
మా కేంద్రంలో ఇప్పటివరకు 2వేల మందికి శిక్షణనిచ్చాం. తొలిసారి మత్స్య కళాశాల విద్యార్థులకు శిక్షణనిస్తున్నాం. చేపపిల్లల పెంపకం దగ్గర్నుంచి.. అవి ఆహార పదార్థాలుగా మారే వరకు వివిధ దశల్లో ఈ రంగంలో ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు అనేక అంశాల్లో అవగాహన కలిగించాం. – డాక్టర్‌ విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం

తొలి కళాశాల.. తొలి బ్యాచ్‌
తెలంగాణలోనే మాది తొలి మత్స్య కళాశాల. మా పర్యవేక్షణలో తొలిబ్యాచ్‌ విద్యార్థులు శిక్షణ పూర్తిచేసుకుని సేవలందించబోతున్నారు. చేపల పెంపకానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నీళ్లలో ఆక్సిజన్‌ తగినంతగా ఉండాలంటే ఏం చేయాలి? ఆరోగ్యకరమైన చేపల్ని ఎలా పెంచాలి? అనే అంశాలపై విద్యార్థులకు శిక్షణనిచ్చాం. – డాక్టర్‌ కిషన్‌కుమార్, అసోసియేట్‌ డీన్, పెబ్బేరు మత్స్య కళాశా

ఎన్నో విషయాలు నేర్చుకున్నా
చేపల్ని పెంచే నీటి వనరుల్లో ఆక్సిజన్‌ ఎంత మోతాదులో ఉండాలి? తగినంత ఆక్సిజన్‌ కోసం సున్నం చల్లాలనే విషయాలు, ఏ రకం చేపలతో ఎక్కువ దిగుమతి వస్తుంది.. చేపలలో వచ్చే వ్యాధులు–నివారణ ఇలాంటి మరెన్నో అంశాల్లో ఇచ్చిన శిక్షణ మత్స్య రంగంపై అవగాహన కలిగించింది. వల విసరడాన్ని నేర్చుకున్నాం. – డి.శివాని, ములుగు జిల్లా 

నేల, నీరు తక్కువున్నా..
నేల, నీరు తక్కువగా ఉన్నా కూడా.. ఆక్వాఫోనిక్‌ పద్ధతిలో చేపల్ని పెంచవచ్చని తెలిసింది. శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాలా? స్వయం ఉపాధి కల్పించుకోవాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు.              జ్ఞానేశ్వర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ జిల్లా 

శిక్షణలో భాగంగా చేపల వల విసరడం ప్రాక్టీస్‌ చేస్తున్న విద్యార్థులు..

మత్స్యకారుల కోసం..
మాది మహబూబాబాద్‌ జిల్లా. మా జిల్లాలో నీటి వనరులు పెరిగాయి. చేపల్లో వచ్చే జబ్బులు– నివారణ చర్యలు, చెరువుల్లో నీళ్లు ఏ రంగులో ఉండాలి? చేపలకు ఎటువంటి మేత వేయాలనేది నేర్పారు. ఎఫ్‌డీఓగా మా జిల్లా మత్స్యకారులు, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పాటుపడతాను. – కళారాణి, మహబూబాబాద్‌ 

కేజ్‌కల్చర్‌ బాగుంది..
నాలుగేళ్ల విద్య పూర్తిచేసుకున్నా. చేపలు పట్టడం, పెంపకం, నిల్వ, మార్కెటింగ్‌ నైపుణ్యాలపై మెలకువలు నేర్చుకున్నా. కేజ్‌కల్చర్‌  విధానంలో చేపల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ఎఫ్‌డీఓగా మత్స్యకారులకు సేవలందిస్తా. – కె.మధు, నాగర్‌కర్నూల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement