సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మూడు జిల్లా వినియోగదారుల కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిని నిర్ణయిస్తూ 2022 నాటి సర్క్యులర్‌ను పక్కన పెడుతూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రాష్ట్ర కమిషన్ అధ్యక్షుల హోదాలో జిల్లా కమిషన్ల అధికార పరిధిని నిర్ణయించవచ్చన్న న్యాయస్థానం.. ఆ నిర్ణయం మాత్రం పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. పరిధి మార్పు ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన వివరణ ఉండాలని పేర్కొంది.
జిల్లా కమిషన్ల న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతి పత్రానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టింది. హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్ల ప్రాదేశిక అధికార పరిధిపై 2022లో జారీ చేసిన సర్క్యులర్‌ను నిలిపివేస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ గతేడాది ఏప్రిల్‌లో రాసిన లేఖను సవాల్‌చేస్తూ న్యాయవాది రాఘవేంద్రసింగ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ పి. శ్యామ్ కోసీ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్చు చెప్పింది.
హైదరాబాద్‌లోని మూడు జిల్లా కమిషన్లు నాంపల్లిలోని చంద్రవిహార్ నుంచి విధులు నిర్వహిస్తున్నాయి. కమిషన్–1లో కేసులు ఎక్కువగా ఉండగా మిగిలిన రెండు కమిషన్లలో కేసులు లేక మధ్యాహ్నంలోగానే విచారణ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయవాదుల సంఘం వినతి మేరకు కేసుల విభజన బాధ్యతను కమిషన్–1కి అప్పగిస్తూ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ రిజిస్ట్రార్ లేఖ రాశారు.
కేసుల విభజనలో వివక్ష చూపుతున్నారని పిటిషనర్ వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేసుల సంఖ్య తక్కువగా ఉన్న విషయాన్ని వివరిస్తూ విభజన చేయవచ్చని, న్యాయవాదుల సంఘం ఇచ్చి న వినతిపై నిర్ణయం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. తగిన కారణాలు చూపకుండా... దానిపై వివరణ లేకుండా విభజన చేయడం సరికాదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment