సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్ డేటింగ్ బానిసగా మారిన ఓ వైద్యుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. తనను మోసం చేసిన నిందితులను పట్టుకోవాలని రెండుసార్లు, పట్టుకున్న వారిని వదిలేయాలని ఓసారి ఇప్పటికే ఈ అధికారులను వేధించాడు. తాజాగా సోమవారం మరోసారి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేస్తూ ఇప్పటి వరకు తన నుంచి రూ.1.5 కోట్లు కొట్టేసిన ‘లొకంటో క్రిమినల్స్’ను కటకటాల్లోకి పంపాలని వేడుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
పద్మారావ్‌నగర్‌కు చెందిన వ్యక్తి (60) కేంద్ర సర్వీసులో వైద్యుడిగా గుజరాత్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోనే ఉంటున్నాడు.
ఇతను 2020లో లొకంటో సైట్‌లో కనిపించిన ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. సైబర్ నేరగాళ్లు యువతుల ఫొటోలు అందులో పోస్టు చేసి సెల్ నంబరు ఇచ్చారు. డేటింగ్‌పై ఆసక్తి ఉంటే కాల్ చేయాల్సిందిగా సూచించారు.
♦సదరు వైద్యుడు వారికి కాల్ చేయగా... కొందరు వ్యక్తులు మాట్లాడి ఆ ఫొటోలు ఉన్న యువతులు డేటింగ్‌కు సిద్ధమన్నారు. దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకుని, కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు.
♦అలా ఆ ఏడాది జూన్ 6 నుంచి అతను ‘చెల్లింపులు’ మొదలెట్టాడు. ఈ కథను వాట్సాప్‌లోకి మార్చిన నేరగాళ్లు ఆ యువతులే చాట్ చేస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు నమ్మించారు. తమను కలుసుకోవాలంటే మరికొంత మొత్తం చెల్లించాలని చెప్పించారు.
♦వైద్యుడు నమ్మేయడంతో దఫదఫాలుగా నగదు వేయించుకుంటూ వెళ్లాడు. ప్రతి సందర్భంలోనూ చెల్లించిన మొత్తంలో కొంత రీఫండ్ అన్నారు. ఏ దశలో అయినా డబ్బు చెల్లించడం ఆపేస్తే ఏమాత్రం తిరిగి రాదంటూ బెదిరించారు.
♦దీంతో బాధితుడు 2020 అక్టోబర్ వరకు రూ.41.5 లక్షలు, కొంత విరామం ఇచ్చినా 2021 మార్చి వరకు మరో రూ.30 లక్షలు చెల్లించేశాడు. జీతంలో దాచుకున్న దానితో పాటు అప్పులు చేసి, చివరకు ప్రావిడెంట్ ఫండ్ లోన్లు తీసుకుని డబ్బు చెల్లించాడు.
♦విషయం కుటుంబీకులకు తెలియడంతో రెండుసార్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు గతేడాది ఢిల్లీకి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు. అతడి ఖాతాలో రూ.18 లక్షలు పడినట్లు ఆధారాలు సేకరించారు.
♦నేరం అంగీకరించిన అతగాడు రూ.12 లక్షలు తిరిగివ్వడానికీ ఒప్పుకున్నాడు. నెల అతడు జైల్లో ఉన్న తర్వాత వైద్యుడు అడ్డం తిరిగాడు. తనతో ఫోన్‌లో మాట్లాడి మోసం చేసిన వ్యక్తి గొంతు, ఇతడి గొంతు వేరుగా ఉన్నాయని, అతడిచ్చే డబ్బు తనకు వద్దన్నాడు.
♦కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసి, నిందితుడిని వదిలి పెట్టే వరకు సైబర్ క్రైమ్ పోలీసులను తనదైన శైలిలో వేధించాడు. ఆపై మళ్లీ ఇతడికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. యువతులు మాట్లాడటం, రీఫండ్ అంటూ చెప్పడంతో డబ్బు చెల్లించడమూ కొనసాగించారు.
♦ఈ కాలంలో మరో రూ.80 లక్షలు వరకు చెల్లించేశాడు. కనీసం ఇంటి ఖర్చులకు డబ్బులేని స్థితికి చేరడంతో సమీప బంధువు విషయం తెలుసుకున్నాడు. ఆయన ద్వారా సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు.
♦వైద్యుడితో పాటు అతడి కుటుంబం పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న ఏసీపీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment