సొంతూరిలో సీఎం దసరా సంబరాలు | Dussehra Celebrations at CM Revanth Reddy Own Village Kondareddypalli | Sakshi
Sakshi News home page

సొంతూరిలో సీఎం దసరా సంబరాలు

Oct 14 2024 1:26 AM | Updated on Oct 14 2024 1:26 AM

Dussehra Celebrations at CM Revanth Reddy Own Village Kondareddypalli

సీఎం హోదాలో తొలిసారిగా కొండారెడ్డిపల్లికి వచ్చిన రేవంత్‌రెడ్డి

సాక్షి, నాగర్‌కర్నూల్‌/కొడంగల్‌: సీఎం రేవంత్‌రెడ్డి దసరా పండుగ సందర్భంగా శనివారం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి అడుగడుగునా పూలు, డప్పు వాయిద్యాలు, బతుకమ్మలు, కోలాటాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నడుమ దసరా వేడుకలు జరుపుకొన్న సీఎం రేవత్‌రెడ్డి అందరినీ పలకరిస్తూ గ్రామస్తుల్లో పండుగ సంబురాన్ని రెట్టింపు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్‌లో చేరుకున్నారు. కొండారెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, కలెక్టర్‌ సంతో‹Ù, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కాలినడకన శమీ పూజకు.. 
కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి తన ఇంటి నుంచి గ్రామంలోని మైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న జమ్మి చెట్టు వద్దకు గ్రామస్తులతో కలిసి కాలినడకన బయలుదేరారు. మార్గమధ్యలో గ్రామస్తులను పేరుపేరునా పలకరిస్తూ.. ఆప్యాయంగా ముచ్చటిస్తూ జమ్మిచెట్టు వద్దకు చేరుకొని శమీ పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు, అభిమానులు సీఎంతో సెలీ్ఫలు, ఫొటోల కోసం పోటీ పడటంతో సుమారు 40 నిమిషాలపాటు వారితో ఫొటోలు దిగుతూ గ్రామస్తులను ఆనందంలో ముంచెత్తారు.

పాలమూరు బిడ్డగా ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత తనదని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతానని చెప్పారు. విద్య, వైద్యం, సాగునీరు, ఉపాధి కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వేగంగా నిర్ణయం తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఎమ్మెల్యేలు, అధికారులకు చెప్పారు. మరోసారి గ్రామానికి వచ్చి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానన్నారు. రాత్రి 8.30 గంటలకు రోడ్డు మార్గంలో కొడంగల్‌కు బయలుదేరారు. కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్‌ కలెక్టర్లు లింగ్యానాయక్, సు«దీర్, సబ్‌ కలెక్టర్‌ ఉమా శంకర్‌ ప్రసాద్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉమా హారతి స్వాగతం పలికారు.

పూల మొక్కలు ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు సీఎంను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్‌ యూసూఫ్, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, యువజన కాంగ్రెస్‌ జాతీయ కోఆర్డినేటర్‌ కృష్ణంరాజు తదితరులు సీఎంను కలిశారు. పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి కొడంగల్‌కు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement